మైనారిటీ ఓటర్లతో ఫలితం తారుమారు

మైనారిటీ ఓటర్లతో ఫలితం తారుమారు
  • ఎంపీలో 22 చోట్ల ముస్లిం ఓటర్ల ప్రభావం

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ముస్లిం ఓటుబ్యాంకును రాబట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ తమ తమ వ్యూహాలను పన్నుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలతో పోలిస్తే ఎంపీ లో ముస్లిం ఓట్ల ప్రభావం అంతస్థాయిలో లేనప్పటికీ, దాదాపు 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో సయోధ్య కలిగివున్నమధ్యప్రదేశ్ ముస్లిం వికాస్ పరిషత్ కో ఆర్డినేటర్ మొహ్మద్ మహిర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2018 ఎన్నికలతో పోలిస్తే ముస్లిం జనాభా 3 నుంచి 4 శాతం పెరిగిందని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ 2018 ఎన్నికల సమయంలో చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలోని ముస్లింలలో 90 మంది నాడు కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేశారని అన్నారు. కేవలం కమల్ నాథ్ పిలుపు మేరకే ముస్లింలు ఓటేయడంతో 10 నుంచి 12 సీట్లు అదనంగా వచ్చాయని అన్నారు. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో 114 సీట్లు కాంగ్రెస్ కు రాగా, బీజేపీకి 109 సీట్లు వచ్చాయని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, స్వతంత్రుల సహకారంతో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ శాసనసభ్యుల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా కేవలం 15 నెలలకే ఆ ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చిందని మహిర్ తెలిపారు. 

అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారు. మధ్యప్రదేశ్ లో 2011 జనాభా లెక్కల ప్రకారం 7 శాతం ముస్లింలు ఉండగా, ప్రస్తుతం అది 9 నుంచి 10 శాతానికి పెరిగింది. మొత్తంగా 47 సెగ్మెంట్లపై ముస్లిం ఓట్ల ప్రభావం ఉంది. 22 సెగ్మెంట్లలో ఫలితాన్నే తారుమారు చేసే స్థాయిలో ముస్లిం ఓట్లు ఉన్నాయి.  47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున 5000 నుంచి 15,000 ముస్లిం ఓట్లు ఉండగా, 22 చోట్ల మాత్రం 15,000 నుంచి 35,000 ఓట్ల దాకా ఉన్నాయి. నువ్వా నేనా అని పోటీపడే స్థానాలలో ముస్లిం ఓట్లు ఫలితాన్నేశాసించే స్థాయిలో ఉంటాయి. భోపాల్ లోని మూడు సెగ్మెంట్లు, ఇండోర్ లో రెండు, బుర్హన్పూర్, జవోరా, జబల్ పూర్ వంటి కీలకస్థానాలు ఇందులో ఉన్నాయని మహిర్ తెలిపారు. ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్, బీజేపీ అధికార ప్రతినిధి సన్వర్ పటేల్  మాట్లాడుతూ, రాజకీయంగా ముస్లింలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ కేవలం ఇద్దరు ముస్లిం అభ్యర్థులను మాత్రమే పోటీకి నిలిపిందని తెలిపారు. 90 నుంచి 100 శాతం ముస్లిం ఓట్ షేర్ కోరుకుంటున్న కాంగ్రెస్ గత 53 ఏళ్ల పాలనలో వారి సంక్షేమానికి ఏంచేసిందని ప్రశ్నించారు. బీజేపీ కేవలం ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లివ్వడమే కాకుండా, వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో ముస్లిం వర్గీయులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురయ్యారని ఆయన ఆరోపించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ స్థాయిలో ముస్లిం ఓట్లు రాజకీయాలలో అంత ప్రభావశీలకంగా లేవని సీనియర్ జర్నలిస్ట్ గిరిజా శంకర్ తెలిపారు. అయితే, మైనారిటీ ఓటర్లు బుర్హాన్ పూర్, ఆస్థా, రత్లాం, ఇండోర్, భోపాల్ లోని కొన్ని సెగ్మెంట్లలో ప్రభావం చూపుతారని అన్నారు. అయితే, మొత్తం మీద మధ్యప్రదేశ్ రాజకీయాలపై ముస్లింల ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.