వెలిచాలకే టికెట్ కన్ఫామ్

వెలిచాలకే టికెట్ కన్ఫామ్
  • చక్రం తిప్పిన మంత్రి పొన్నం
  • కరీంనగర్ టికెట్ ప్రకటించిన సి వేణుగోపాల్
  • రాజేందర్ రావు కు కలిసి వచ్చిన వెలమ సామాజిక వర్గం 
  • గెలిపించి రాహుల్ కు గిఫ్ట్ గా ఇస్తామని అధిష్టానానికి హామీ
  • కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
  • రాష్ట్ర రాజకీయ సమీకరణాలతో అలిగిరెడ్డికి భంగపాటు 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరు ను అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాదులో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టికెట్ ప్రకటనలో జాప్యం జరగడంతో ఇన్ని రోజులుగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు వెలిచాల రాజేందర్ రావు క్యాండిడేట్ గా ప్రకటించి సస్పెన్స్ కు తెరదించింది. కరీంనగర్ టికెట్ కేటాయింపులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధిష్టానం వద్ద చక్రం తిప్పి తన పంతం నెగ్గించుకున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇస్తామని అధిష్టానానికి తెలిపినట్లు తెలుస్తోంది. వెలిచాలకు టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ సెగ్మెంట్ లోని నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు నియోజకవర్గ ఇన్చార్జిలము గెలిపించే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ టికెట్ పొన్నం ప్రభాకర్ కు కేటాయించిన విషయం విధితమే. అయితే ఆ సమయంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తన టికెట్ ను ప్రభాకర్ కు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రవీణ్ రెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఎంపీ టికెట్ కేటాయిస్తామని అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. అయితే రాష్ట్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించడం సాధ్యం కాలేదు. దీంతో అలిగిరెడ్డికి మరోసారి శృంగభంగం తప్పలేదు. వెలిచాలకు టికెట్ కేటాయించడంతో పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.