కాంగ్రెస్​ శ్రేణులకు కేసీ దిశానిర్దేశం @ మిషన్  15

కాంగ్రెస్​ శ్రేణులకు కేసీ దిశానిర్దేశం @ మిషన్  15
  • కో ఆర్డినేషన్​ కమిటీలో వ్యూహరచన
  • చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్​పై స్పెషల్​ ఫోకస్​
  • 18న భారీ ర్యాలీతో మెదక్​లో నీలం మధు నామినేషన్​
  • ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయండి
  • పార్టీ నేతలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచన


ముద్ర, తెలంగాణ బ్యూరో : ‘ మిషన్...15’ ను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. గత అసెంబ్లీలో ఎన్నికల్లో కనిపించిన జోరును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకుగానూ 15 సీట్లకు తగ్గకుండా కైవసం చేసుకోవాల్సిన అవసరముంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఆదివారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో కేసీ వేణుగోపాల్​అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నేతలకు కీలక అంశాలపై సూచనలు చేశారు. కేంద్రంలో  ఇండియా కూటిమి కొలువుదీరడంలో తెలంగాణ రాష్ట్రం కీలకం కావాలని హితబోధ చేశారు. 

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని వేణుగోపాల్​ అన్నారు. అందువల్ల పార్టీ నేతలు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. 
పార్లమెంట్  ఎన్నికలను  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రధానంగా పాంచ్‌ న్యాయ్‌ గ్యారంటీలు, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను నెల రోజుల్లో ఇంటింటికీ ఎలా తీసుకెళ్లాలన్న దానిపైనా చర్చలు జరిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఏఐసీసీ ముఖ్య నేతలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరయ్యే సభలకు సంబంధించిన ఏర్పాట్లు, వాటికి సంబంధించిన షెడ్యూల్‌పైనా సమీక్షించారని తెలుస్తోంది. నల్లొండ, భువనగిరిలో నిర్వహించే రెండు బహిరంగ సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు. అలాగే ఏఐసీసీ నిర్వహించిన సర్వల్లో నియోజకవర్గాలువారీగా పార్టీ పరిస్థితిపైనా ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో ఒకరిద్దరు ఆశించిన విధంగా ప్రచారంలో ముందుకు వెళ్లడం లేదని వేణుగోపాల్ అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. సదరు అభ్యర్థులు ఒకటి, రెండు రోజుల్లోగా రెంటింపు ఉత్సాహంతో బరిలోకి దిగని పక్షంలో అవసరమైతే వారి స్థానంలో ఇతరులకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కూడా వెనుకాడేది లేదని ఒకింత కఠినంగానే హెచ్చరించినట్లుగా తెలిసింది. 

నియోజకవర్గ ఓటు బ్యాంకుపై చర్చ..

ప్రధానంగా నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ఎలాంటి అభిప్రాయం ఉంది? అనే అంశాలపై కేసీ వేణుగోపాల్​చర్చించారు. ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా పార్టీ ఓటు బ్యాంకు ఎంత? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటు బ్యాంకు ఎంత? ఇప్పుడు అది ఎంత శాతం పెరిగింది? అనే అంశాలపై కూడా లోతుగా సమీక్షించారు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరెవరు బరిలో ఉన్నారు? అక్కడ ఆయా పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఎంత? కాంగ్రెస్‌ గెలిచేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలు ఎన్ని? నిర్దేశించిన లక్ష్యం మేరకు 15 లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలి తదితర అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. అలాగే  పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థులపైనా చర్చ జరిగింది. దీనిపై నేతల మధ్య  భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్ధుల పేర్లను ప్రకటించాలని నిర్ణయించారు.

సునీల్​ కనుగోలు పవర్ పాయింట్ ప్రజంటేషన్..

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా రాజకీయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయన అనేక సర్వేలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వేలో  ఏయే పార్టీల అభ్యర్థులతో హస్తం పార్టీకి గట్టి పోటీ ఉంది? దానిని ఎలా అధిగమించాలి? అన్న  అంశాలపై చర్చించారు. మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఎమ్మెల్యేలు, మంత్రులు, పోటీ చేయనున్న అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. ఎక్కడైనా పార్టీ బలహీనంగా ఉన్నట్లయితే, అక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశాలను కూడా వివరించారు.  ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండడంతో ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలి? ఎవరెవరు ఏయే బాధ్యతలు తీసుకోవాలి? వాటిని సమర్థవంతంగా ఎలా నిర్వర్తించాలన్న  అంశాలపై చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మల్కాజిగిరి, చేవేళ్ల, సికింద్రాబాద్ నియోజకవర్గాలపై పార్టీ నేతలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ కు అతి కీలకంగా మారిన  మెదక్  లోక్ సభ స్థానంపై ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరడానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

మూడింటిపై  ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ!

కాంగ్రెస్ పార్టీ మ‌రో మూడు స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రకటించాల్సి ఉంది. ఈ మూడింటిపై ఒక‌టి రెండు రోజుల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గానికి పొంగులేటి వియ్యంకుడు రామ‌ స‌హాయం సురేంద‌ర్‌రెడ్డి కుమారుడు ర‌ఘురామిరెడ్డికి దాదాపుగా ఫైన‌ల్ అయిన‌ట్లేన‌న్న చ‌ర్చ జరుగుతోంది. అలాగే క‌రీంన‌గ‌ర్‌కు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, రాజేంద‌ర్‌రావు మ‌ధ్య తీవ్రపోటీ నెల‌కొన్నద‌ని, హైద‌రాబాద్‌కు డీసీసీ అధ్యక్షుడు స‌మీరుల్లా పేరు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లేనని తెలుస్తోంది. మొత్తం మీద ఒక‌టి రెండు రోజుల్లో ఈ స్థానాల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.