కన్నుల పండువగా ధర్మపురీశుల కల్యాణం

కన్నుల పండువగా ధర్మపురీశుల కల్యాణం
  • వేలాది తరలివచ్చిన భక్తులు
  •  గోవిందా నామస్మరణ. మారుమ్రోగిన ఆలయం

ముద్ర, ధర్మపురి: ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా లోని ధర్మపురిలో శనివారం శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జగింది. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన మువ్వురు ఇలవేలుపుల కల్యాణోత్సవాల సందర్భంగా  సాయంత్రం గోధూళి శుభ ముహూర్తంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన శేషాప్ప కళావేదిక పై  ఆలయాలనుండి స్వాముల ఉత్సవ మూర్తులను వేదమంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాలతో భక్తజనం తోడురాగా కొనితెచ్చి ఆసీనులగావించారు. సంప్రదాయ రీతిలో యజ్ఞోపవీత ధారణ, రక్షాబంధనం, మహాసంకల్పం, భాసిక ధారణం, గోత్రనామ, కన్యాదానం, మంగళాష్టకములు, గూడ జీరధారణ, అక్షతారోపణాది కార్యక్రమాలను విధివిధానంగా నిర్వహించారు.

ప్రభుత్వ పక్షాన  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా  పెద్దపెల్లి వెంకటేష్ నేత, అదనపు కలెక్టర్ మంద మకరంద, మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి  కొప్పుల స్నేహాలత, మున్సిపాలిటీ పక్షాన చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, కమిషనర్ రమేష్ పాలకవర్గం తదితరులు వేరువేరుగా స్వాములకు పట్టు వస్త్రాలు, కట్నకానుకలను సమర్పించారు. సాయంత్రం నుండి రాత్రి వరకు కల్యాణం కొనసాగింది.కల్యాణం చూడడానికి వచ్చిన భక్తులకు స్థలం  సరిపడక ఇబ్బందులు పడ్డారు. కల్యాణం  వీక్షించేందుకు ప్రధాన కూడలిలో డిజిటల్ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.ఆలయ ప్రాంగణం గోవిందా నామస్మరణ తో మారుమ్రోగింది.కల్యాణం లో ఎస్పీ భాస్కర్,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేశ్ ,జడ్పీటీసీ బత్తిని అరుణ,ఆలయ రేనవేషన్ కమిటీ సభ్యులు ఇందరపు రామన్న, వేముల నరేష్,గుంపుల రమేష్,స్తంభం కాడి మహేష్,ఇనుగంటి రమ వెంకటేశ్వర్ రావు,గునిశెట్టి రవీందర్, కౌన్సిలర్లు, ఆలయ అర్చక సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.