ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం... నిర్మాత నవీన్ ​ఎర్నేనిపై కేసు

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం... నిర్మాత నవీన్ ​ఎర్నేనిపై కేసు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచనలం చోటుచేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా ఎదుగుతున్న మైత్రీ మూవీ మేకర్స్​ అధినేతల్లో ఒకరు నవీన్‌ ఎర్నేనిపై పోలీసులు ఆదివారం కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫోన్​ ట్యాపింగ్​లో నవీన్​పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చెన్నుపాటి వేణు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో కీలకంగా వ్యహరించిన రాధాకిషన్‌తో సహా 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా నిర్మాత ఎర్నేని నవీన్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

గతంలో కొంతమందితో కలిసి క్రియా హెల్త్‌ కేర్‌ను వేణు అనే వ్యక్తి ప్రారంభించారు. అయితే ఆ సంస్థలో  డైరెక్టర్‌గా ఉన్న నవీన్ ఎర్నేని, మరికొందరు డైరెక్టర్లు తనను చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తితో కలిసి కిడ్నాప్ చేయించారని ఫౌండర్ వేణు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కిడ్నాప్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్‌ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, మరికొందరు పోలీసుల ప్రమేయం ఉందని కూడా వేణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్‌లో ఎర్నేని నవీన్ పేరును కూడా చేర్చారు.

ఫోన్ ట్యాపింగ్ లో పలువురు వ్యాపారులను బెదిరించి సంబంధిత యాజమాన్య హక్కుల బదలాయింపు చేసినట్లు రాధా కిషన్ రావును విచారణ జరిపిన సందర్భంలో అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా  సినీ నిర్మాత, ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఫిర్యాదులో ఉండడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసులో నిందితులుగా ఉన్న  చంద్రశేఖర్ వేగే, రాజశేఖర్ తలశిల, గోపాల కృష్ణ సురెడ్డి, రవికుమార్ తదితరుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.