కమీషన్ల  కోసమే బండి స్మార్ట్ సిటీ పరిశీలన

కమీషన్ల  కోసమే బండి స్మార్ట్ సిటీ పరిశీలన
  • స్మార్ట్ సిటీ అడ్వైజరి కమిటీ చైర్మన్ గా సంజయ్ ఫెయిల్
  • ఓట్లు, కోట్ల కోసమే జిమ్మిక్కులు
  • స్మార్ట్ సిటీ పనులపై ఫిర్యాదు చేస్తా
  • సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు దండుకోవడం కోసమే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించారని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. సోమవారం 51వ డివిజన్లో క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన నాలుగు సంవత్సరాల తర్వాత స్మార్ట్ సిటీ పనులు గుర్తు రావడం విడ్డూరమన్నారు. ఎంపీ హోదాలో ఏ ఒక్కరోజు కూడా అధికారులతో సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా బండి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఎండి గా నగరపాలక సంస్థ కమిషనర్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్ ఇద్దరు కుమ్మక్కై పనులను గాలికి వదిలేసారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓట్ల కోసం, కోట్ల కోసం స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షిస్తున్నారని ఎద్దేవా చేశారు. టవర్ సర్కిల్ వ్యాపారులు పార్లమెంటు సభ్యునికి ఎన్నిసార్లు సమస్యలపై మొరపెట్టుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధిని ఏ ఒక్కరోజు పట్టించుకోని బండి సంజయ్ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లాలూచీపడి పనుల నాణ్యతను గాలికి వదిలేసారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అప్పుడు ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్, మేయర్ గా నేను ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి ముందుచూపుతో స్మార్ట్ సిటీ సాధించామని చెప్పారు. బండి సంజయ్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన రానున్న ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటులో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. 51 డివిజన్‌లో డ్రైనేజీ నీరు రోడ్డు పైకి వస్తుందని స్మార్ట్ సిటీ పనులు ప్రణాళిక బద్ధంగా జరగడంలేదని విమర్శించారు. నాణ్యతలేని పనులు చేస్తూ స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ బిల్లులు తీసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. పనుల నాణ్యత పై విచారణ చేపట్టాలంటూ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. రవీందర్ సింగ్ వెంట టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా నాయకులు పెండ్యాల మహేష్, కేమసారం తిరుపతి తదితరులు ఉన్నారు.