ఫిట్ నెస్ లేని విద్యా సంస్థల బస్సులపై కఠిన చర్యలు 

ఫిట్ నెస్ లేని విద్యా సంస్థల బస్సులపై కఠిన చర్యలు 

డి టి సి  మామిండ్ల  చంద్రశేఖర్ గౌడ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : పాఠశాలలు పున: ప్రారంభమైన  నేపథ్యం లో విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల బస్సులు తప్పని సరిగా ఫిట్ నెస్ కలిగి ఉండాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లా వ్యాప్తం గా 1629 విద్యా సంస్థల బస్సు లు ఉంటే ఇప్పటి వరకు కేవలం 817 బస్సు లు మాత్రమే  ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 812 బస్సులు సంబంధిత రవాణా శాఖ కార్యాలయం లో ఫిట్ నెస్  సర్టిఫికెట్ పొందాలని తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన విద్యా సంస్థల బస్సులు ఎట్టి పరిస్థితులలో రోడ్లపై  తిరగరాదని, 15  సంవత్సరాలు దాటిన బస్సు లు, ఫిట్ నెస్ లేని బస్సుల లో విద్యార్థులను రవాణా చేస్తే సీజ్ చేయడమే కాకుండా యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డి టి సి హెచ్చరించారు. 

బస్సు మంచి కండిషన్ లో ఉంచడంతో పాటు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో  818 బస్సులకు 468 బస్సులు, పెద్దపల్లి జిల్లా లో 249 బస్సులకు 75 బస్సులు జగిత్యాల జిల్లా లో 427  బస్సులకు 213 బస్సులు, రాజన్న సిరిసిల్లాలో 135  బస్సులకు 61 బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉన్నాయని మిగిలిన బస్సులు కూడా త్వరలో ఫిట్ నెస్ చేసుకోవాలని తెలిపారు.అప్పటి వరకు ఎట్టి పరిస్థితులలో  ఆ బస్సు లను  రోడ్ల పై  తిప్పరాదని హెచ్చరించారు. త్వరలో  విద్యాసంస్థల  యాజమాన్యాలతో, డ్రైవర్ల తో సమావేశం నిర్వహిస్తామని డి టి సి చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు.