గంగుల సహకారంతో బండి వేల కోట్లు సంపాదిస్తున్నాడు.. కరీంనగర్లో చీకటి ఒప్పంద రాజకీయాలు.. రోహిత్ రావు హౌస్ అరెస్ట్

గంగుల సహకారంతో బండి వేల కోట్లు సంపాదిస్తున్నాడు..  కరీంనగర్లో చీకటి ఒప్పంద రాజకీయాలు..  రోహిత్ రావు హౌస్ అరెస్ట్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నియోజకవర్గ నాయకుడు, ఎమ్మెస్సార్ మనుమడు మేనేని రోహిత్ రావు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  చీకటి ఒప్పందాలపై  తడిబట్టలతో మహాశక్తి దేవాలయంలో ప్రమాణం చేస్తానని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మహాశక్తి దేవాలయానికి బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు రోహిత్  రావు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో రోహిత్ రావ్ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇంట్లోనే అమ్మవారిపై చీకటి ఒప్పందాలపై ప్రమాణం చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ల మధ్య చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.

గంగుల సహకారంతో బండి సంజయ్ వందల కోట్ల సంపాదించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలాసవంతమైన విల్లాలు, లగ్జరీ కార్లు, కొడుక్కు ఖరీదైన బైకులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన బండి వేల కోట్లు ఎలా సంపాదించారని మండిపడ్డారు. ఇవన్నీ చూసి బిజెపి కార్యకర్తలే బండిని  ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి,బీఆర్ స్ ని నమ్మద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు రహస్య ఒప్పందంతోనే పరస్పరం సహకరించుకుంటున్నాయని అన్నారు. నేను చేసిన ఆరోపణలు నిజం కావని బండి సంజయ్ తడిగుడ్డలతో మహాశక్తి దేవాలయంలో ప్రమాణ చేస్తాడా అని ప్రశ్నించారు. ఒకరి మీద ఒకరు కనీస విమర్శలు చేసుకోవడం లేదంటే వారిద్దరి మధ్య ఉన్న సఖ్యత ఏంటో కరీంనగర్ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య యుతంగా చేసే నిరసనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. అధికార పార్టీకి పోలీసులు వంత పాడడం సరికాదన్నారు. అనంతరం రోహిత్ రావును పోలీసులు అరెస్ట్ చేసి పిటిసి కి తరలించారు.