ఓటరు జాబితాను సక్రమంగా రూపొందించాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ఓటరు జాబితాను సక్రమంగా రూపొందించాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: రెండో విడత ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పని సరిగా ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగా గురువారం కలెక్టరేట్ చాంబర్ లో ఓటరు జాబితాపై కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు కార్యక్రమంపై 25 ప్రశ్నలతో కూడిన గూగుల్ స్ప్రెడ్షీట్ ఆన్లైన్ క్విజ్ ను నిర్వహించారు. ఈ క్విజ్ ద్వారా విధివిధానాలు సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని, దీనికోసం సంపూర్ణ సమాచారంతో సిద్ధం కావాలని అన్నారు. రెండవ విడత ఓటరు నమోదు కార్యక్రమం కోసం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే జూన్ 23 నాటికి పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికీ కొన్ని మండలాల్లో చాలా తక్కువ మొత్తంలో ఇంటింటి సర్వే జరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

బూత్ స్థాయి అధికారులు, తహసీల్దార్ లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని, రోజు ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించేలా చూడాలని తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించి, పోలింగ్ కేంద్రాల వారిగా ఉన్న ఇండ్ల సంఖ్య, సర్వే చేసిన ఇండ్లు, కొత్తగా నమోదు చేయాల్సిన ఓటర్లు, శాశ్వతంగా తొలగించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటరు కార్డులో సవరణలు మొదలగు అంశాలపై నివేదికలను ఈఆర్‌ఒ నెట్ లో సమర్పించాలని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా పకడ్బందీగా రెండో విడత ఓటర్ జాబితా రూపకల్పన కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇప్పటివరకు వచ్చిన ధరఖాస్తులు, ప్రస్తుత స్థితిగతులపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఓటరు జాబితా రూపకల్పనలో సర్వీస్ ఓటర్లు, తొలగించిన ఓటర్ల క్షేత్రస్థాయి ధ్రువీకరణ, నూతన ఓటర్లకు ఓటరు కార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

జిల్లాలో ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలు, వారికి అందించిన నోటీసులు, తదితర పూర్తి సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణలో వచ్చిన దరఖాస్తులు, వాటిపై తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా సేకరించిన వివరాలను బిఎల్ఓ యాప్ లో నమోదు చేసేలా చూడాలని అన్నారు. ఓటరు జాబితా లో ఒక ఇంటిలో 6 కంటే అధికంగా ఓట్లు ఉంటే ప్రత్యేకంగా పరిశీలించి ధృవీకరించాలని సూచించారు. దివ్యాంగులు, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్లకు ఓటు హక్కు కల్పన కోసం చేసిన ప్రత్యేక కార్యక్రమాలను వివరించాలని పేర్కొన్నారు. గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు నూతనంగా నమోదు చేసిన ఓటర్ల వివరాలు, ఓటరు జాబితాలో వచ్చిన మార్పులు, తొలగించిన ఓటర్లను క్షేత్రస్థాయిలో జరిపిన ధ్రువీకరణ ప్రక్రియ వాటిపై నివేదిక తయారు చేసి సమర్పించాలని, బూత్ స్థాయి అధికారులకి, వీఆర్వోలకు ఓటరు జాబితా రూపకల్పన ఏరోనేట్ 2.0, బిఎల్ఓ యాప్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఆర్ డిఓ శ్రీనివాస్, వివిధ మండలాల తహసీల్దార్ లు, డిటి లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.