పల్లెలను ప్రగతిబాట పట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

పల్లెలను ప్రగతిబాట పట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

మొండ్రాయిగూడెంలో  దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి  సత్యవతి రాథోడ్..

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను ప్రగతిబాట పట్టించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెంలో పల్లెప్రగతికార్యక్రమంలో గురువారం ఆమె పాల్గొన్నారు. ఈ..సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి అంగన్వాడీ సేవలు, పంచాయతీ పారిశుద్ధ్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంబించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి, ఆ దిశగానే ఊరూరా పల్లెప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లెప్రగతి కార్యక్రమాలను చేపట్టామని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం  ముఖ్యమంత్రి కేసీఆర్  పాలనలో పల్లెలన్నీ అభివృద్ధి చెందాయన్నారు. పట్టణాల్లో ఉన్న సౌకర్యాలన్ని పల్లెల్లో కల్పిస్తున్నామని, తాగునీటికి ఇబ్బందులు తొలగి, ప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయని ఆమె తెలిపారు. పల్లెల పై పట్టుఉన్న కేసీఆర్‌ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం మని అభినందించారు.

ఈ ప్రాంతంలో 300 ఎకరాలకుగాను 375 మందికి పోడు పట్టాలు అందించబోతున్నామని, వీరికి రైతుబంధు, రైతు బీమాతో పాటు గిరివికాసం కూడా కలిస్తామని మంత్రి సత్యవతిరాథోడ్ ప్రకటించారు. పల్లె ప్రగతిలో బాగంగా పచ్చదనం, పరిశుభ్రతతో సరికొత్తగా గ్రామాలు పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం ట్రాక్టర్లు, ట్రాలీలతో ఇంటింటికీ చెత్త సేకరణ, గ్రామానికో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు నర్సరీల ఏర్పాటు.. నిరంతరం మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసారు. పారిశుధ్య కార్మికుల జీతాలు సైతం గతంలో రూ.1500 ఉంటే సీఎం కేసీఆర్  రూ.9,500 పెంచడంతో రెగ్యులర్‌గా వారు పని చేస్తున్నారన్నారు.

గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కింద ప్రభుత్వం 9 ఏండ్లల్లో .1,154 కోట్లు సర్పంచుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని గుర్తుచేసారు. పల్లెప్రగతి కార్యక్రమం కింద ఇప్పటి వరకు తెలంగాణలో రాష్ట్రంలో 13,528 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12745 గ్రామపంచాయతీల్లో 1329.73 కోట్ల ఖర్చుతో వైకుంఠధామాలు నిర్మించారని, రూ.524.57 కోట్లతో 2598 రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు. అభివృద్ధిని ప్రతిఒక్కరు ఆశీర్వదించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, ఐటిడిఏ పిఓ అంకిత్, ట్రైని కలెక్టర్ పింకేష్, సర్పంచ్ భారతి, ఎంపీపీ విజయ, జెడ్పిటిసి పుష్పలత, ఎంపిటిసి సదయ్య, ఒడిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేణు, మండల పార్టీ అధికార ప్రతినిధి భానోత్ నెహ్రూ ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.