ప్రజా వ్యతిరేక పార్టీలను ఓడించాలి..

ప్రజా వ్యతిరేక పార్టీలను ఓడించాలి..
  • తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక రాష్ట్ర చైర్మన్ ఆకునూరి మురళి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ప్రజా వ్యతిరేక పార్టీలను ఓడించాలని తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక రాష్ట్ర చైర్మన్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక టిఎస్ డిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర గురువారం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంది. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వైనాల గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బస్సు యాత్రకు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపిలను ఓడించాలని కోరారు. ఓటు మన ప్రాథమిక హక్కు అని, మన భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం అని చెప్పారు. మద్యానికి, నోటుకు అమ్ముడు పోవద్దని సూచించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, నియంతృత్వ పోకడలతో దోపిడీ చేస్తున్న పాలకవర్గాలను ఓడించి తీరాలని అన్నారు.

తెలంగాణాలో నీళ్లు నిధులు నియామకాలపై ఉద్యమం కొనసాగిందని, ఆ నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ, డబుల్ బెడ్ రూములు ఎక్కడ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఏమైంది, రైతుల రుణమాఫీ ఎక్కడ, కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఏది, పంటల బీమా ఏది, దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ మాయమైంది, దళితులకు 10 లక్షల రూపాయలు ఎక్కడ అమలు చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శనాస్త్రాలు సంధించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏవి, కాళేశ్వరం ప్రాజెక్టు కింద 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఏవి అన్నారు. ఒక లక్ష ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. విదేశాలలోని నల్లధనం తెచ్చి, ఇంటింటికి 15 లక్షలు ఇస్తామన్నారని, ఆ హామీ ఏమైనది విమర్శించారు. దేశంలో ఏడాది కి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నల వర్షం కురిపించారు. బడా కార్పొరేటర్లకు ఊడిగం చేస్తున్న బీఆర్ఎస్, బిజెపిలను ఓడించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. అంతకుముందు అరుణోదయ కళాకారులచే పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్, రైతుకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కామెడీ ఉప్పలయ్య, ప్రొఫెసర్లు, కళాకారులు కొత్తపల్లి రవి, పిడిఎస్ యు నాయకులు నరసింహ, మహిళా సంఘం నాయకురాలు జాన్సీ తదితరులు పాల్గొన్నారు.