‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ కథ వినగానే కొత్త కాన్సెప్ట్ అనిపించింది.. బ్రహ్మాజి

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ కథ వినగానే కొత్త కాన్సెప్ట్ అనిపించింది.. బ్రహ్మాజి

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాజి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త క్యారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను.

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం. సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్‌లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్‌ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు. సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా నిలుస్తుంది.