కాంగ్రెస్ లో "బీ" ఫామ్ టెన్షన్

కాంగ్రెస్ లో "బీ" ఫామ్ టెన్షన్
  • అల్గిరెడ్డికి అధిష్టానం పిలుపు?
  • బి ఫామ్ ఇస్తారా... బుజ్జగిస్తారా...
  • నామినేషన్ల ప్రక్రియ ముగింపుకొచ్చిన తెగని ఉత్కంఠ
  • నేడు వెలిచాల, 25న అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నామినేషన్?
  • కరీంనగర్ టికెట్ కేటాయింపు లో "కీ" రోల్  పోషిస్తున్న పొన్నం
  • అంతుచిక్కని అధిష్టానం నిర్ణయం 

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఎవరికనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్న ఉత్కంఠకు తెరపడడం లేదు.  ఈరోజు వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలుచేస్తుండగా, ఈనెల 25న అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి సైతం నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం "బీ" ఫామ్ ఎవరికి ఇస్తుందోనన్న టెన్షన్  ఇరు వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి   పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాలలో పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ముఖ్య నేతలతో కలిసి వెలిచాల రాజేందర్ రావు పాల్గొని ప్రసంగించారు. దీంతో వెలిచాల రాజేందర్ రావు  దే కాంగ్రెస్ టికెట్ అని కాంగ్రెస్ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. వెలిచాలకు టికెట్ కేటాయిస్తే  గెలిపించి తీసుకువస్తామని పొన్నం అధిష్టానానికి స్పష్టమైన హామీ ఇచ్చి ఒప్పించినట్లు తెలుస్తుంది. దీంతో పొన్నం ప్రభాకర్ వైపే ఎఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ మొగ్గు చూపినట్లు చర్చ నడుస్తుంది. ఇదిలా ఉండగా  కాంగ్రెస్ అధిష్టానం నుండి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి పిలుపు వచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలపై అతనితో చర్చించి టికెట్ పై స్పష్టత ఇచ్చే  అవకాశాలు ఉన్నాయి.

బి ఫామ్ ఇస్తారా? లేక బుజ్జగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.  ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం బీఫామ్ ఇవ్వని ఎడల ప్రవీణ్ రెడ్డి 25న నామినేషన్ వేసి తన కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి  సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్టు రాజకీయ సమీకరణలలో భాగంగా పొన్నం ప్రభాకర్ కు కేటాయించారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేక ఎంపీ టికెట్ కేటాయిస్తామని  కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వడంతో పోటీ నుండి విరమించుకున్నారు. తన రాజకీయ అస్తిత్వాన్ని పణంగా పెట్టి పొన్నం ప్రభాకర్ కు సహకరించానని అధిష్టానం వద్ద బలంగా తన వాదనను ఇప్పటికే వినిపించినట్లు తెలుస్తుంది. బీఫామ్ తో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థిని కాదని చివరి నిమిషంలో సి ఫామ్ ఇచ్చి మరో అభ్యర్థితో నామినేషన్ వేయించిన  సందర్భాలు కాంగ్రెస్ చరిత్రలో అనేకం గా ఉన్నాయి. బి ఫాం టెన్షన్ నుండి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసి  వేణుగోపాల్ ఏవిధంగా తెర దించుతారో  వేచి చూడాల్సి ఉంది.