ఫిర్యాదుదారులకు సంతృప్తికర సేవలందించాలి: పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు

ఫిర్యాదుదారులకు సంతృప్తికర సేవలందించాలి: పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు
Complainants should be served satisfactorily Police Commissioner L Subbaraidu

ముద్ర ప్రతినిధి కరీంనగర్: పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా రిసెప్షన్ అధికారులు సేవలందించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. ఫిర్యాదుదారులకు కనీస మర్యాదనిచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టి సమస్యలను ఓపికగా ఆలకించి, సత్వరం పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్ కేంద్రాలలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం బుధవారంనాడు కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ రిసెప్షన్ కేంద్రాల్లో పనిచేస్తున్న అధికారులు అన్నివర్గాలకు చెందిన ప్రజల ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తూ వేగవంతంగా వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏరోజుకు సంబంధించిన వివరాలను ఆరోజు అప్లోడ్ చేయాలని చెప్పారు. టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. సమర్థవంతమైన సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందని, ప్రతి పోలీసు పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు క్రమశిక్షణతో మెదులుతూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, ఏసిపి కాశయ్య, కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు తదితరులు పాల్గొన్నారు.