సాగు నీటి సమస్యకు బీ ఆర్ ఎస్ నాయకులదే నైతికంగా బాధ్యత...

సాగు నీటి సమస్యకు బీ ఆర్ ఎస్ నాయకులదే నైతికంగా బాధ్యత...
  • రైతుల్లో ఆందోళన చెందేలా,  వాస్తవాలను వక్రీకరిస్తున్నా హరీష్ రావు
  • ఎంపిగా కవిత, ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడే చక్కెర ప్యాక్టరీలు మూత 
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అక్టోబర్ లో ప్రణాళికలు రూపొందించకుండ ఎస్ ఆర్ ఎస్ పీ నీటిని తరలించడంతో సాగు నీటి సమస్య తలెత్తిందని, సాగు నీటి సమస్యకు నైతికంగా బీ ఆర్ ఎస్ నాయకులు బాధ్యత వహించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రబీ సాగు నీటి సమస్యల పై బీ ఆర్ ఎస్ నాయకులు మాట్లాడడం విస్మయం కలుగుతుందని, ఎస్ ఆర్ ఎస్ పి నుండి 10 టీఎంసీల నీరు తరలించడంతో సమస్య  తలెత్తిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు తడి ఆరిపోకుండా, చివరి వరకు పంటలను కాపాడాలని ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా నీరు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. రైతుల్లో ఆందోళన చెందేలా,  హరీష్ రావు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, 2023 జనవరి తో పోల్చితే 2024 జనవరి లో 10-20 మిలియన్ల విద్యుత్ అధికంగా వినియోగం పెరిగింది... హరీష్ రావు ఎం మాట్లాడుతూన్నాడో ఆయనకే తెలియాలన్నారు.  గత ప్రభుత్వం దీర్ఘ కాలిక అప్పుల పై వడ్డీ రాయితీ పూర్తిగా ఎత్తివేసిందని, పంట భీమా పథకానికి నిధులు చెల్లించలేక పథకాన్ని ఎత్తివేశారని అన్నారు.

పదేళ్ల నుండి ఎప్పుడైనా పంట నష్ట పరిహారం చెల్లించారా అని హరీష్ రావును ప్రశ్నించారు. ఐదేళ్లు గడిచిన రుణ మాఫీ చేయలేదు మీరు కూడా మాట్లాడుతారా అని హరీష్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంట రుణాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, కాంగ్రెస్ రైతు సంక్షేమ ప్రభుత్వం రైతులు పంట రుణాల చెల్లింపుల పై రైతులు ఆందోళన చెందవద్దన్నారు. పంట నష్టం పరిహారం చెల్లించేలా అంచనాలు రూపొందించి, చర్యలు చేపడుతున్నారు.  పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రు.10 వేలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని పంటల బీమా పథకం అమల్లోకి తీసుకురావడంతో పాటు, రైతులు చెలించాల్సిన ప్రీమియం సైతం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

నిజామాబాద్ బీ అర్ ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు ప్రారంభించారో కూడా తెలియకపోతే ఎలా అని, మెట్ పల్లి చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ..చక్కెర ఫ్యాక్టరీ అమ్మకానికి 51 శాతం పెట్టింది టీడీపీ, బిజెపి మిత్ర పక్షం..  కొనుగోలు చేసింది బిజెపి ఎం పి గోకరాజు గంగరాజు అని తెలిపారు. ఎంపిగా కవిత, ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడే  వారి నియోజక వర్గాల పరిధిలోని రెండు చక్కెర ప్యాక్టరీలు మూత పడ్డాయని, ఎవరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారో, రైతులకు  ఏ పార్టీ ఎం చేసిందో అన్ని గమనిస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ పాలన ఉన్నప్పటికీ ఐదేళ్ల లో ఏమి చేయని అరవింద్ మరో సారి ఎన్నికల్లో ఓటు వేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. రైతుల  సంక్షేమం కోసం చర్యలు చేపడుతామని, చక్కెర కర్మాగారం పునః ప్రారంభం.. మద్దతు ధర కల్పన..కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భరోసానిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి భూషణం, బండ శంకర్, కొత్త మోహన్, కల్లపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.