'మల్లీశ్వరి' కథ పుట్టిందిలా..

'మల్లీశ్వరి' కథ పుట్టిందిలా..

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని చాలా విషయాల్లో అంటారు. అందులోనూ సినిమాల విషయం వచ్చే సరికి ఇది అక్షరాల నిజమనే చెప్పాలి. అప్పటి చిత్రాలకు ఇప్పటి చిత్రాలకు చాలా తేడా ఉంది. ఎప్పటికి గుర్తుండి పోయే మధురమైన ఆణిముత్యం మల్లీశ్వరి. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రామారావు, భానుమతిల నటన వెరసి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదలై 72ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ నిత్యనూతనంగా, సంగీత సాహిత్యాల అందాల భరిణగా ఉంటుంది. మల్లీశ్వరి... తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ కళాఖండం. దర్శకుడిగా బి.ఎన్. రెడ్డినీ, గేయ రచయితగా కృష్ణశాస్త్రినీ, సంగీత దర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావునీ చిరస్మరణీయం చేసిన అజరామర చిత్రం. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు, వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత 'మొఘల్-ఎ-ఆజమ్'కు ఏమాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై అరవై సంవత్సరాలు దాటినా 'మల్లీశ్వరి' నిత్యనూతనం. మిగతా దర్శకులతో పోలిస్తే బి.ఎన్. రెడ్డి భిన్నంగా కనిపిస్తారు.

ఆయన తీసిన ప్రతి చిత్రమూ కళాఖండమన్న పేరు ఆర్జించింది. కేవలం పదకొండు చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. అన్నిట్లోనూ 'మల్లీశ్వరి' పెద్ద ఖ్యాతిని తెచ్చుకుంది.భారతి మాసపత్రిక 1944 మే సంచికలో ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణకృత్యం' అనే నాటిక ఆ తర్వాత రేడియోలో ప్రసారమైంది. దాన్ని విన్న బి.ఎన్. రెడ్డి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో దివాన్ షరార్ రాసిన 'ది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్' కథ కూడా ఆయనకు నచ్చింది. ఆ నాటికనూ, ఈ కథనూ మేళవించి ఆయన 'మల్లీశ్వరి' కథను తయారు చేయించారు. ఈ చిత్ర కథాంశాన్ని ఓసారి మననం చేసుకుందాం. హంపీ విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలో బావామరదళ్లయిన నాగరాజు, మల్లీశ్వరికి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆర్థికంగా కాస్త పైచేయి అయిన మల్లి తల్లి నాగమ్మకు వారి పెళ్లి ఇష్టంలేదు. దాంతో డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు నాగరాజు. ఒక వర్షపు రాత్రి సత్రంలో మల్లి నాట్యాన్ని మారువేషంలో తిలకించిన శ్రీకృష్ణదేవరాయలు ఆమె ఇంటికి పల్లకీ పంపించి రాణివాసానికి రప్పిస్తాడు.