అమెరికా ఎన్నికల్లో వివేకానందం! అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రామస్వామి దూకుడు

అమెరికా ఎన్నికల్లో వివేకానందం! అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రామస్వామి దూకుడు

వాషింగ్టన్ : ఆయన మాటలకు ఓ మెక్‌డొనాల్డ్‌ మేనేజర్‌ అభిమానయ్యాడు. ఆయన టీవీ చర్చ విని ఓ చర్చి పాస్టర్‌ ఇంటికి భోజనానికి పిలిచేశాడు. ఆయన వాదనా పటిమకు ఏకంగా ఎలాన్‌ మస్క్‌ ఫిదా అయిపోయాడు. ఇలా అమెరికాలో సామాన్యుల నుంచి అసామాన్యులనుకున్నవారినీ ఆకర్షించుకుంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సంచలనం సృష్టిస్తున్న పేరు వివేక్‌ రామస్వామి. భారతీయ సంతతికి చెందిన ఈ పేరు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతానికి మారుమోగిపోతోంది. అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న అమెరికా ఓటర్లను ముఖ్యంగా రిపబ్లికన్లను 38 ఏళ్ల రామస్వామి వాదన ఆలోచింపజేస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ కేసుల వెంట తిరుగుతుంటే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రోజురోజుకూ రామస్వామి ప్రాచుర్యం పెరుగుతోంది.

జాతి వివక్షపై : సంప్రదాయ క్రిస్టియన్‌ పద్దతులకు మొగ్గు చూపే రిపబ్లికన్‌ పార్టీ అభిమానులను హిందూ కుటుంబానికి చెందిన భారతీయ సంతతి రామస్వామి ఆకర్షిస్తుండటం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. రిపబ్లికన్‌ పార్టీలో డొనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతుంటే విన్నవారెవరైనా కాసేపు ఆగాల్సిందే! జాతి వివక్ష, సామాజిక న్యాయాల విషయంలో రామస్వామి చేస్తున్న వాదన (యాంటీ వోకిజం) ఆసక్తికరం. ట్రంప్‌ మాదిరిగా నల్లజాతివారిపై శ్వేతజాతీయులను ఆయన రెచ్చగొట్టడం లేదు. శ్వేతజాతి వారిని చిన్నచూపుచూడటం, కించపరచటం, వివక్ష చూపటం (రివర్స్‌ రేసిజం) కూడా వివక్షే అని ప్రకటించటం ద్వారా ఆలోచన రేకెత్తిస్తున్నారు. ట్రంప్‌ అభిమానులనూ పునరాలోచనలో పడేస్తోంది. అమెరికా సంపన్నుల్లో పేరొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్‌అక్‌మాన్‌ వివక్షపై రామస్వామి వాదన విన్న తర్వాత ‘‘ఈయన ఎన్నడో అమెరికా అధ్యక్షుడవుతాడు. ఆయన సందేశం కోసం సిద్ధంగా ఉండండి’’ అని జోస్యం చెప్పారు.

తాను బయటివాడిని కాదని : చాలామంది మొహమాటపడో, విమర్శలకు భయపడో, వివాదాలకు జడిసో మాట్లాడకుండా వదిలేసే సత్యాలను నిర్మొహమాటంగా వెల్లడించటం రామస్వామి బలం. గుంపులో గోవిందయ్యలా ఉండకుండా ఎవరేమనుకున్నా మనసులో మాట చెప్పేయటం ఆయనను ఆకర్షింపజేస్తోంది. ఉదాహరణకు అబార్షన్‌ల మీద అమెరికాలో వివాదం నడుస్తోంది. అబార్షన్‌ నిర్ణయం స్త్రీల హక్కు అని ఉద్యమకారులు నినదిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరోగమనవాదులుగా చిత్రీకరిస్తున్నారు. కానీ... రామస్వామి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పిస్తే అబార్షన్‌కు నేను వ్యతిరేకం అని ధైర్యంగా ప్రకటించారు. ఈ వైఖరి సంప్రదాయ అమెరికన్‌ క్రిస్టియన్‌ ఓటర్లను ఆకర్షిస్తోంది. రిపబ్లికన్‌ ట్రంప్‌లా విచక్షణ రహితంగా ప్రకటనలు చేయకుండా డెమొక్రాట్లలా తాయిలాలు ప్రకటించకుండా సంయమనం పాటిస్తూ, ప్రతి విధాన నిర్ణయాన్నీ తార్కికంగా వివరిస్తున్న తీరు చాలామందిని ఆకట్టుకుంటోంది. పైగా తన హిందూ కుటుంబ మూలాలను ఎక్కడా దాచకుండా మతాలేవైనా మంచి కోసమే అంటూ బైబిల్‌ను కూడా వల్లెవేస్తున్నారు. ‘‘నేను క్రైస్తవంలో పెరగలేదు. కానీ మనందరం ఒకే మూలాల్ని పంచుకుంటున్నాం. అనుసరించే విలువలు ఒక్కటే’’ అంటూ మతపరమైన సమతౌల్యాన్ని పాటించటం ద్వారా అమెరికా రాజకీయాల్లో తానేమీ బయటివాడిని కాదని ఒప్పిస్తున్న తీరు రామస్వామి ప్రత్యేకత. ఎలాన్‌ మస్క్‌ అంతటివాడు ఆయన ట్వీట్‌లను మెచ్చుకుంటూ రీట్వీట్‌ చేస్తున్నారు.

ఒకవంక ట్రంప్‌తో పోటీపడి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వానికి ప్రయత్నిస్తూనే మరోవైపు రాజకీయ కేసుల్లో ట్రంప్‌నకు మద్దతుగా రామస్వామి నిలవటం విశేషం. ట్రంప్‌పై కేసుల విచారణలో పారదర్శకత లోపించిందంటూ రామస్వామి అమెరికా న్యాయ విభాగంలో పిటిషన్‌ వేశారు. బహుశా కేసుల కారణంగా ఎన్నికల్లో నిలబడని పరిస్థితి తలెత్తితే ట్రంప్‌ సైతం రామస్వామి వైపు మొగ్గు చూపుతారేమో! ట్రంప్‌నకు మీరు ఉపాధ్యక్షుడిగా ఉంటారా అన్న ప్రశ్నకు రామస్వామి అవునని బదులివ్వటం గమనార్హం! అలనాడు స్వామి వివేకానందుడు అధ్యాత్మికంగా అమెరికాను ఉర్రూతలూగించినట్లు ఇప్పుడు అమెరికాను ఈ రాజకీయ వివేక్‌ స్వామి ఊపేస్తాడా? అనేది చూడాలి!.

ఆకట్టుకుంటున్న రామస్వామి నినాదాలు..‘‘దేవుడు సత్యం! ప్రపంచంలో మనుషులు రెండేరకాలు. ఆడ, మగ!. మానవశ్రేయస్సుకు శిలాజ ఇంధనాలు అవసరం. రివర్స్‌ వివక్షా వివక్షే!. హద్దుల్లేనిది సరిహద్దు కానేకాదు. పిల్లల చదువులను తల్లిదండ్రులే నిర్ణయించాలి. అది బాధ్యత. చిన్న కుటుంబాలే మానవాళికి మేలు. పెట్టుబడిదారీ వ్యవస్థ పేదరికాన్ని పోగొడుతుంది. రామస్వామి తల్లిదండ్రులు కేరళ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. వివేక్‌ అక్కడే జన్మించారు. ఇప్పటికీ ఆయన కుటుంబం హిందూ సంప్రదాయాలనే అనుసరిస్తుంది. పుట్టుకతోనే అమెరికా పౌరుడు కాబట్టి అధ్యక్ష పదవికి అర్హుడు.

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి బయాలజీ చదివిన రామస్వామి యేల్‌ లా స్కూల్‌ నుంచి లాయర్‌ అయ్యారు. చదివేటప్పుడు హార్వర్డ్‌ పొలిటికల్‌ యూనియన్‌కు అధ్యక్షుడిగా కూడా చేశారు. వాదన, చర్చలంటే ఎంతో ఇష్టం. రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ పార్టీలంటే ఇష్టం లేదని చెప్పేవారు. భార్య డాక్టర్‌ అపూర్వ. వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2014లో రోవెంట్‌ సైన్సెస్‌ అనే సంస్థను స్థాపించిన రామస్వామి 2015లో అమెరికా స్టాక్‌ మార్కెట్లో భారీ ఐపీఓకు వెళ్లారు. క్యాన్సర్‌, అల్జీమర్స్‌లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారు చేసి అనుమతులు పొందటంతో బయోటెక్‌రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలోని టాప్‌ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. ప్రస్తుతం రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నవారిలో సంపద దృష్ట్యా ట్రంప్‌ తర్వాతి స్థానం రామస్వామిదే!.