మహిళల అణచివేతలో ఆఫ్ఘనిస్థాన్‌దే పైచేయి : ఐరాస

మహిళల అణచివేతలో ఆఫ్ఘనిస్థాన్‌దే పైచేయి : ఐరాస

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ దేశంలో మహిళలు, బాలికలకు అనేక హక్కులు లేకుండా పోయాయని ఐక్య రాజ్య సమితి బుధవారం తెలిపింది. మహిళలు, బాలికలు తీవ్ర అణచివేతకు గురవుతున్న దేశాల్లో ప్రపంచంలోనే ఆఫ్ఘనిస్థాన్ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. తాలిబన్ పాలకులు మహిళలు, బాలికలు ఇళ్లల్లోనే చిక్కుకుపోయేవిధంగా నిబంధనలను అమలు చేస్తున్నారని తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను కైవసం చేసుకున్నారని, అప్పటి నుంచి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారని ఆరోపించింది. బాలికలు ఆరో తరగతి వరకు మాత్రమే చదివేందుకు అనుమతిస్తున్నారని, బాలికలు, మహిళలు పార్కులు, జిమ్‌లు వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడంపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పని చేయకుండా మహిళలపై నిషేధం విధించారని తెలిపింది. తల నుంచి కాలి వేళ్ళ వరకు కప్పుకోవాలని ఆదేశించారని పేర్కొంది. ఐరాస ఆఫ్ఘనిస్థాన్ మిషన్ చీఫ్, ఐరాస సెక్రటరీ జనరల్‌కు ప్రత్యేక ప్రతినిధి రోజా ఒటుంబయేవ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాలిబన్ల పరిపాలనలోని ఆఫ్ఘనిస్థాన్ మహిళల హక్కుల విషయంలో ప్రపంచంలోనే అత్యంత అణచివేతగల దేశమని తెలిపారు.