మావోయిస్టు పార్టీకి మరో  కోలుకోలేని ఎదురు దెబ్బ...

మావోయిస్టు పార్టీకి మరో  కోలుకోలేని ఎదురు దెబ్బ...
  • నేలరాలిన మూల స్థంభం
  • మద్యప్రదేశ్ లో ఎదురుకాల్పులలో
  • కేంద్రకమిటీ సభ్యుడు  హిడ్మా మృతి...
  • ధ్రువీకరించిన హిడ్మా సోదరుడు మాడావి సేతు 

 
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మూడు రాష్ట్రాలకు మింగుడుపడని హిడ్మా మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో మావోయిస్టు మూల స్తంభం అయిన హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దిబ్బ తగిలింది. హిడ్మా చని  పోయాడని తెలువడంతో పోలీసులు కూడా ముందుగా నమ్మలేదన్నట్లు తెలిసింది. పోలీసుల కు  ఊహించని విధంగా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎంతో మందిని పోలీసుల్ని హతమార్చిన హిడ్మా నేల రాలిండని విషయం తెలుసుకున్న ప్రజలు, పోలీసులు కూడా నమ్మలేకపోతున్నారు. మృతుడి పై రూ. 14 లక్షల రివార్డ్ ఉంది. 


17 ఏళ్లకే అడవిబాట పట్టిన  హిడ్మా ఆపరేషన్ లో 200 కు పైగా పోలీసులను హతమార్చాడు, మంచి  వ్యూహకర్త...పోలీసులకు కొరకరాని కొయ్య.... అతిచిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్రకమిటీలో స్థానం పొందిన మొదటి మావోయిస్టు హిడ్మా. కేంద్ర ప్రభుత్వం నిషేదించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా (40) మధ్య ప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా గాధీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకోదాడర్ అటవీప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. హిడ్మా సోదరుడు మాడావి సేతు ద్రువీకరించడంతో మధ్యప్రదేశ్ పోలీసులు హిడ్మా ఎన్ కౌంటర్ లో చనిపోయినట్టుగా ప్రకటించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా ఏడోతరగతి వరకే చదివాడు. 17 ఏళ్ళ వయస్సులోనే ఉద్యమంవైపు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో చేరాడు. భారీ దాడులకు పేరున్న హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఒకటో నంబర్ కమాండర్ గ భాద్యతలు చేపట్టాడు. దాంతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పనిచేసాడు. అతిచిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. పోలీస్ బలగాలకు కొరకరాని కొయ్యల తయారయ్యాడు. రెండు దశాబ్దాలకుపైగా చత్తిస్ ఘడ్ దండకారణ్యంలో జరిగిన దాడులన్నీ కూడా ఇతని కనుసన్నల్లోనే జరిగినట్టుగా పోలీస్ రికార్డులు చెప్పడం విశేషం. చింతల్నార్, దోర్నపాల్, తాడిమెట్ల, మినప,తదితర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 200 మందికి పైగా పోలీసులు మృతిచెందడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకుడని పోలీస్ రికార్డ్ లు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ 2006 లో బెటాలియన్లు స్థాపించిన నాటినుంచి వాటిలోనే హిడ్మా కొనసాగుతున్నాడు. బెటాలియన్ల లోనే ఉండి దాడులకు వ్యూహాలు పన్నుతాడని పేరు ఉంది. పార్టీలో పరిశోధన,అభివృద్ధి విభాగం అతడి కనుసన్నల్లోనే పనిచేస్తాయి. దేశీయ ఆయుధాలను, ఐఈడి బాంబులను, బూబీట్రాప్ లను తాయారు చేయడంలో మంచి పట్టు ఉంది. యుద్ధ నైపుణ్య మెళుకువలు, బలగాలపై మెరుపు దాడులు చేసే మెళుకువల్ని క్యాడర్ కు అలవోకగా నూరిపోస్తుంటాడని పార్టీలో పేరు ఉంది. 2007 మార్చిలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. దీనికి హిడ్మానే నాయకత్వం వహించాడు. 


ఈ ప్రమాదంలో దాదాపు 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు మరణించారు. సాధారణంగా మావోయిస్టులు మందు పాతరల మీద ఆధారపడతారు. కానీ తొలిసారిగా ఆ ప్రాంతంలో హిడ్మా సారధ్యంలో మావోయిస్టులు ఆయుధాలతో తలపడ్డారు. ఏకంగా 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. అయితే మావోయిస్టులను మందు పాతరల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో హిడ్మాదే ప్రధాన పాత్ర అని నిఘా వర్గాలు గుర్తించాయి. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు. వాస్తవంగా హిడ్మా నేరుగా తుపాకులు పేల్చేది చాలా తక్కువ. కానీ దగ్గరుండి మిగతా మావోయిస్టులను నడిపిస్తాడు. ఎంతో అవసరం అయితే తప్ప తన దగ్గర ఉన్న తుపాకీకి పనిచెప్పడు అనేపేరు కూడా ఉంది. ఇప్పటి వరకూ హిడ్మా కు ఒక గాయం కూడా కాలేదు. పోలీసులకు చిక్కలేదు. మావోయిస్టు దళంలో బాగా పేరు వచ్చి దూకుడుగా సాగే మావోయిస్టులు ఎక్కువ కాలం కొనసాగలేరు. వారు చనిపోవడమో లేదా లొంగిపోతుంటారు. కానీ, హిడ్మా అలా కాదు.ఇప్పటికీ మావోయిస్టులకు దిశా నిర్దేశం చేస్తూనే వచ్చాడు. అనేక రకాలైన దాడుల్లో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల కాలంలో హిడ్మా చనిపోయినట్టుగా రెండుసార్లు పోలీసులు ప్రకటించారు. కానీ హిడ్మా బతికే ఉన్నాడని పార్టీ ఒక లేఖ ద్వారా ప్రకటించింది. మద్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రెండు దశాబ్దాలకు పైగా కొరకరాని కొయ్యల తయారైన హిడ్మా ఎదురుకాల్పుల్లో చనిపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.