అడవి తల్లి మూగబోయిన రోజు

అడవి తల్లి మూగబోయిన రోజు
  • నేలరాలిన విప్లవ ధ్రువ తారలు...
  • కోయ్యూరు ఎన్ కౌంటర్ కు 24 ఏళ్లు...
  • ఈనెల 8 వరకు  పిఎల్ జఏ వారోత్సవాలు..
  • డ్రోన్ కెమెరాలతో  తూర్పున  పోలీసుల నిఘా..
  • మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కూంబింగ్..


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:విప్లవకారుల గుండె చెదిరింది.. అన్నలను ఒదిగి పట్టుకున్న అడవి తల్లి తల్లడిల్లింది. బంధువుకుల వర్షం కురిసిన ఆ నీశీథి లో  విప్లవ ధ్రువతారాలు నేలరాలిన  సంఘటన జరిగి  23 ఏళ్లు పెట్టే గడిచిపోయింది. యావత్తు మావోలు ఊహించని విపత్తు అది. ఆరోజు ఒక్కసారిగా మావోలను చీకటి అలుముకుంది. అడవి తల్లి మూగబోయింది...అదే 1999, డిసెంబర్ 2. భూమి భుక్తి విముక్తి అంటూ అడవి బాట పట్టిన అన్నలు ఆ దినం ఊపిరి బిగబట్టిన రోజు. అప్పటి పీపుల్స్ వార్ ( మావోయిస్టు పార్టీ) అగ్ర నాయకులు పోలీసుల తుపాకుల నుంచి దూసుకు వచ్చిన తూటాలు ముద్దాడిన రోజు అది. పోరు బిడ్డల నెత్తురు రాలుతుందని... అడవి తల్లి గుండెలవిశేలా కన్నీరు పెడుతుందని అడవి మూగబోతుందని ఊహించలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తూర్పు డివిజన్ ను నిశ్శబ్దం ఆవహించింది. అన్నల కోటకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నడువు రా... తమ్మి నడువు రా... తల్లి నడువవే అంటూ.. దళ సభ్యులతో ముందుండి ఉద్యమం నడిపించిన నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి తోపాటు మరో దళ సభ్యుడు లక్ష్మీరాజ్యం ఎన్కౌంటర్ లో నేలకొరిగి నేటికీ 24 ఏళ్లు అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తూర్పు డివిజన్ ప్రస్తుతం భూపాలపల్లి(జయశంకర్) జిల్లా మలహర్ మండలం కొయ్యూరు ఘటన యావత్తు మావోయిస్టులను, సానుభూతిపరులను విషాదంలోకి నెట్టివేసింది..

ఆ అగ్రనేతల ఆశయ సాధనలో పిఎల్ జి ఏ ఏర్పాటు...

కొయ్యూరు ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన ఆ ముగ్గురు అగ్ర నేతలను చిరకాలం గుర్తుంచుకోవాలని వారి ఆశయ సాధనలో ముందుకు సాగడానికి మావోయిస్టులు ప్రజా గేరిల్ల ఆర్మీ పేరుతో 2000 సంవత్సరంలో ఒక సైనిక బలగమును ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం పోరు బాటలో అమరులైన వారిని స్మరించుకుంటూ పి ఎల్ జి ఏ వారోత్సవాలను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈనెల రెండు నుంచి  వారం రోజులపాటు  తూర్పు డివిజన్లో మావోయిస్టులు  అమరవీరుల వారోత్సవాలను నిర్వహించుకుంటారని తెలిసి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

అడవి బాట పట్టిన ఆదిరెడ్డి..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు 10 కిలోమీటర్ల దూరంలో కొత్తగట్టు గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్ జన్మించాడు. విద్యార్థి దశలోనే 1973 లో ఉద్యమ బాట పట్టాడు. 1975లో ఆర్ఎస్ యు కోసం ప్రచారం చేసి 1980లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, అదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా, 1982లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, అదిలాబాద్ ఉద్యమానికి, సికాస ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1984లో రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా  పనిచేశాడు.

 విద్యార్థి దశ నుంచే  నరేష్ కు విప్లవ భావాలు...

నరేష్ కు విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలు వంటబట్టాయి. బాల్యం నుంచే నీతి నిజాయితీగా మెలిగేవాడు. నరేష్ ను ఇంజనీర్ గా చూడాలని తండ్రి పృథ్వీధర్ భావించి సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో చేర్పించారు. అప్పుడే విప్లవ సాహిత్యం కు ఆకర్షితుడై ఉద్యమ బాట పెట్టాడు. అప్పుడు నరేష్ కు 1981లో పెళ్లి చేశారు. పెళ్లయిన రెండేళ్లకే పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. 1989 నుంచి 1995 వరకు రీజనల్ కమిటీ కార్యదర్శిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేశాడు. 20 ఏళ్లు ఉద్యమమే ఊపిరిగా అడవికే అంకితం అయ్యాడు. 1999 డిసెంబర్ 2న ఎన్కౌంటర్ లో నెలకొరిగాడు.

అన్యాయాలు చూడలేక అజ్ఞాతంలోకి సంతోష్ రెడ్డి..

దేవరూప్పల మండలం కడివెండికి చెందిన ఎర్రం రెడ్డి లక్ష్మారెడ్డి, అనసూర్య లకు  1959లో సంతోష్ రెడ్డి జన్మించాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి అప్పుడే ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు. 1983లో కొండపల్లి సీతారామయ్య కేసులో అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా తుపాకీ పట్టాడు. మావోయిస్టు పార్టీలో చేరి 16 ఏళ్లుగా పనిచేశాడు. రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. దురదృష్టవశాత్తు కొయ్యూరు ఎన్కౌంటర్ తో అస్తమయం అయ్యాడు.

 బేగంపేటలో విప్లవ సూరీల స్మారక స్తూపం...

కొయ్యూరు ఎన్ కౌంటర్ లో నెలకొరిగిన విప్లవసూరిల  స్మారకార్థం కమాన్ పూర్ మండలం బేగంపేటలో 78 అడుగుల ఎత్తులో స్మారక స్తూపం నిర్మించారు. ఇక్కడి రామగిరి ఖిల్లాతో ఆ ముగ్గురు అగ్ర నాయకులకు ఉన్న సంబంధం నేపథ్యంలోనే 2004లో కాంగ్రెస్ హయాంలో మావోయిస్టు పార్టీపై తాత్కాలికంగా నిషేధం ఎత్తివేశారు. అప్పుడు మావోయిస్టు నేత బండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ స్థూపం నిర్మించి విరసం నేత వరవరరావు, రత్నమాల, పద్మ కుమారి చేతుల మీదుగా అనేక ఉద్రిక్తత పరిస్థితుల నడుమ స్థూపం ఆవిష్కరించారు. అప్పుడు విప్లవ గీతాలతో బేగంపేట బెంబేలెత్తిపోయింది.

 పి ఎల్ జి జే వారోత్సవాలపై డ్రోన్ నిఘా...

పి ఎల్ జి జే వారోత్సవాలపై  పోలీస్ యంత్రాంగం డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీకి అత్యంత కంచుకోటగా ఉన్న తూర్పు డివిజన్ పరిధిలోని ముత్తారం, కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం మండలాల్లోని ప్రభావిత గ్రామాలపై పోలీసులు నిఘాను ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. సమస్యాత్మక అటవీ గ్రామాలలో కొమ్మింగ్ కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ప్రజా ప్రతినిధులు, మావోయిస్టు టార్గెట్లను, పోలీస్ ఇన్ ఫార్మర్లను  అప్రమత్తం చేసినట్లు సమాచారం.