దళిత, గిరిజనులే టార్గెట్..

దళిత, గిరిజనులే టార్గెట్..
  • విద్యుత్ బకాయిల వసూళ్లకు పేదల మెడపై సెస్ కత్తి
  • ఉన్నోళ్ల జోలికి పోతలేరు.. పేదోళ్ల ఇండ్లకు కరెంట్ కట్
  • 15 ఏండ్లుగా చోద్యం చూసి.. ఒక్కసారిగా ఊర్లపై పడ్డారు..
  • బొప్పాపూర్ ఒక్క గ్రామంలోనే 36 దళిత కుటుంబాలకు కరెంట్ కట్
  • సెస్ డైరక్టర్ కృష్ణహరి కల్పించుకోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్దరణ
  • సిరిసిల్ల సెస్ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత..
  • సంస్థ అభివృద్ది కోసమే అంటూ.. పాలకవర్గం ప్రకటనలు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సంస్థ పాలకవర్గం ఆదేశాలతో జిల్లాలో విద్యుత్ బకాయిల నిర్బంధ వసూళ్లు కొనసాగుతున్నాయి. 15 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లుల బకాయిలు పట్టించుకోని సెస్.. చోద్యం చూసి ఉన్నట్లుండి.. ఒక్కసారిగా ఊర్లపై పడ్డారు. పాత బకాయిలన్ని కట్టాలని లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయని పేర్కొంటూ పేద, దళిత, గిరిజన వాడలపై సెస్ నిర్బంధకాండ కొనసాగిస్తుంది. బడాబాబుల జోలికి వెళ్లకుండా కేవలం, పేదలు,దళిత,గిరిజనులపైనే సెస్ తమ ప్రతాపాన్ని చూపుతుంది.

ఎల్లారెడ్డిపేట మండలం లోని ఒక్క బొప్పాపూర్ గ్రామంలోనే 36 దళిత కుటుంబాలకు ఇండ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పలు గిరిజన తండాల్లో ఇదే తంతను కొనసాగిస్తున్నారు. బొప్పాపూర్ దళిత కుటుంబాలు ఆందోళన చేయడంతో స్పందించిన ఎల్లారెడ్డిపేట సెస్ డైరక్టర్ వలుస కృష్ణహరి సెస్ ఉన్నతాధికారులతో మాట్లాడి.. కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే గొడవలు అవుతాయని, 15 ఏండ్ల బకాయిలు ఒక్కసారిగా కరెంట్ కట్ చేసి అడిగితే ఎక్కడి నుంచి కడుతారని పేర్కొనడంతో మళ్లీ విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఓ పేద కళకారుడు రూ.3000 బకాయి ఉన్నాడని ఇంటి మీటర్ తో పాటు తాను ఉపాధీ పొందే పిండి గిర్ని కి విద్యుత్ నిలిపివేయడంతో ఆ కళకారుడు కాళ్ల వేళ్లపడి బ్రతిమిలాడి రెండు మూడు రోజుల్లో కడుతాను.. అని రాసివ్వడంతో విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతకు సంబంధించిన ఓ స్టోన్ క్రషర్కు సంబంధించి రూ.36 లక్షలకు పైగా విద్యుత్ బకాయి ఉండగా అటువైపు చూడలేదు. సిరిసిల్ల బడాబాబుల పరిశ్రమల విద్యుత్బకాయిల వైపు చూడటంలేదు. ఎందుకంటే పేద ప్రజలు, దళితలు, గిరిజనులనే టార్గెట్ చేస్తున్నరన్న విమర్శలు వస్తున్నాయి. 15 ఏండ్లుగా లేని హాడావిడి.. విద్యుత్ బకాయిల వసూళ్లపై ధ్యాస ఇప్పుడే ఎందుకు వచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు.ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి రూ.కోట్లు బకాయిలు ఉండగా.. వసూళ్లు చేయకుండా.. ప్రభుత్వంను ఒప్పించి బకాయిలు వచ్చేలా చేసుకోకుండా.. పేదలపై సెస్ కన్నెర్ర చేయడం ఏంటని జిల్లాలో చర్చ కొనసాగుతుంది. నిర్బంధ వసూళ్లు చేయకుండా.. పాత బకాయిలు నెలకు కొన్ని వాయిదాల పద్దతిలో కట్టే అవకాశం ఇవ్వాలని.. ప్రజలు కోరుతున్నారు. సిరిసిల్ల సెస్ పాలకవర్గం నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది.