9 కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

9 కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానంలో ఊరట లభించింది. 9 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో తోష్ ఖానా అవినీతి కేసు కూడా ఉంది. శనివారం ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ లోని హైకోర్టుకు వెళుతుండగా, ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది.

దాంతో ఆయన కోర్టుకు వెళ్లడం ఆలస్యమైంది. తనను ఎలాగైనా అరెస్ట్ చేయించాలన్న పన్నాగంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఎన్నికల్లో తన పార్టీకి నాయకత్వం వహించకుండా చేయడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశం అని అన్నారు. అటు, ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు గత మూడ్రోజులుగా కాచుకుని ఉన్న పోలీసులు లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ ఇంటి గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ అప్పటికే హైకోర్టుకు ప్రయాణమయ్యారు.