నిలదీసిన లీడర్లు.. నీళ్లు నమిలిన ఆఫీసర్లు

నిలదీసిన లీడర్లు.. నీళ్లు నమిలిన ఆఫీసర్లు
  • వాడీ వేడిగా జనగామ జడ్పీ మీటింగ్‌
  • విద్యా, వ్యవసాయ, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ శాఖలపై సభ్యుల గరం 

ముద్ర ప్రతినిధి, జనగామ : ‘మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులు ఎందుకు జాప్యం జరుగుతోంది.. ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ ప్రకటించినా జిల్లాలో చాలా మందికి ఎందుకు రుణ మాఫీ చేయడం లేదు.. మిషన్‌ భగీరథ ట్యాంకులు శిథిలావస్థలో ఉన్నా ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడం లేదు..’ అంటూ జడ్పీ మీటింగ్‌లో జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రశ్నల వర్షం కురిపించారు. సభ్యుల ప్రశ్నల ధాటికి ఆఫీసర్లు నీళ్లు నమిలారు. మంగళవారం జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జనగామ జిల్లా పరిషత్‌ మీటింగ్‌ వాడీ వేడిగా సాగింది. సభ ప్రారంభం కాగానే లింగాలఘణపురం జడ్పీటీసీ గుడి వంశీధర్‌‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు రుణ మాఫీని అమలు చేస్తున్నా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు చెడ్డపేరు వస్తుందన్నారు. గ్రామాల్లో చాలా మంది రైతు తమ వద్దకు వచ్చి రుణ మాఫీ కావడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారన్నారు. అయితే వ్యవశాఖ అఫీసర్లు ప్రజాప్రతినిధులను ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇందుకు డీఏవో వినోద్‌ స్పందిస్తూ ప్రతి ఏవో దగ్గర ఇక నుంచి రుణ మాఫీ పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. జిల్లాలో 2018 డిసెంబర్‌‌ వరకు రూ.లక్ష అప్పు ఉన్న 93,861 మందిని రుణ మాఫీకి అర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. అందులో  ఇప్పటి వరకు 33,048 మంది మాఫీ లబ్ధిపొందారని తెలిపారు. అయితే 3 వేల మందికి బ్యాంక్‌లో టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల డబ్బులు అందలేదన్నారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

 
ముప్పై సార్లు మాట తప్పారు...

విద్యాశాఖపై జరిగిన చర్చలో తరిగొప్పుల జడ్పీటీసీ ముద్దసాని పద్మజారెడ్డి డీఈవో రామును గట్టిగా నిలదీశారు. తమ మండలంలో కస్తూర్భా స్కూల్‌లో చిన్న చిన్న రిపేర్ల కోసం ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు డీఈవో తాను మూడు సార్లు మాట తప్పానని ఒప్పుకోగా.. మూడు సార్లు కాదు ముప్పై సార్లు మాట తప్పారని మండిపడ్డారు. దీంతో అడిషనల్‌ కలెక్టర్‌‌ సుహాసిని కలుగజేసుకుని ఎన్ని పనులు ఉన్నా అన్ని పక్కన పెట్టి నాలుగు రోజుల్లో ఆ స్కూల్‌ పనులు కంప్లీట్‌ చేయాలని డీఈవో రాము ఆదేశించారు. ఇక మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలపై జరిగిన చర్చలో కూడా జడ్పీ సభ్యులు బొల్లం అజయ్‌, వరలక్ష్మి, పుస్కూరి శ్రీనివాస్‌, ఇల్లందుల బేబీ తదితరులు ప్రశ్నల వర్షం కురిపించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికారులు పెండింగ్‌ పనులను వెంటనే కంప్లీట్‌ చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించాలని జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు. సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.