నిఫా వైరస్ తో మరణాల రేటు ఎక్కువ

నిఫా వైరస్ తో మరణాల రేటు ఎక్కువ
  • కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం
  • కంటైన్​మెంట్ జోన్లు గా ఏడు పంచాయితీలు  
  • కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ 

తిరువనంతపురం :కేరళలో బయటపడిన నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. ఈ వైరస్ తో మరణాల రేటు ఎక్కువని, వ్యాపించే తీవ్రత తక్కువని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటన చేశారు. కోజికోడ్ లో ఇద్దరు మరణించడానికి ఈ వైరస్ కారణమన్నారు. ఈ వైరస్ మెదడుపై దాడి చేసి, ప్రాణాంతకంగా మారుతుంది.  కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ వెలుగు చూడడం ఇదే మొదటి సారి కాదు. 2018లో మొదటి సారి బయటపడగా, 23 మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. అదే ఏడాది 21 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. 2019, 2021లోనూ ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. నిఫా వైరస్ కు ఎలాంటి టీకా, చికిత్స లేదు. మనుషుల నుంచి, గబ్బిలాల నుంచి, పందుల నుంచి ఇది సోకుతుంది. మలేషియా,  సింగపూర్ లో 1999 లో తొలిసారి దీన్ని గుర్తించారు.  మరోవైపు పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ టీమ్ రెండు రోజులు కేరళలో పర్యటించనుంది.  కోజికోడ్ మెడికల్ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అనుమానితులకు పరీక్షలు నిర్వహించనుంది.  చెన్నై నుంచి ఎపిడెమాలజిస్టుల బృందం రానుంది. కోజికోడ్ పరిధిలోని ఏడు పంచాయితీలను కంటెయిన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. చికిత్స కోసం మోనోక్లోనల్ యాంటీబాడీలను పంపించేందుకు ఐసీఎంఆర్ అంగీకరించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇతర చోట్లకు, ఇతర ప్రాంతాల నుంచి అక్కడకు ఎవరినీ అనుమతించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.