పొన్నాల’ భావోధ్వేగం..

పొన్నాల’ భావోధ్వేగం..
  • 45 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నా..
  • అప్పటి కాంగ్రెస్‌ వేరు.. ఇప్పడు వేరు
  • మాట్లాడుదామంటే కలిసే వారు లేరు..
  • చెబితే వినే వారు లేరు..
  • బీసీలను అస్సలు పట్టించుకోవడం లేదు..
  • మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల 

ముద్ర ప్రతినిధి, జనగామ : ‘నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా..  ఒకప్పటి కాంగ్రెస్‌ పార్టీ వేరు.. ఇప్పుడున్న కాంగ్రెస్‌ వేరు.. ఇలా మాట్లాడేందుకు బాధగా ఉంది..’ అంటూ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్‌ పార్టీలో బీసీ లీడర్లను గుర్తించడంలేదన్నారు. తాను 1983 నుంచి 2023 వరకు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, 12 ఏళ్లు పలు శాఖల మంత్రిగా పనిచేశానని చెప్పారు. అయినా నాకు అవమానాలు, అవహేళనలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం లీడర్లు పార్టీని ఆగం చేస్తున్నారని అందుకే మనస్తాపంతో రాజీనామా చేస్తున్నానని తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ 40 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 50 శాతం సీట్లు కూడా రాలేదన్నారు. విషయంపై పార్టీలో ఎంతో చర్చించానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పార్టీలో మాట్లాడుదామంటే కలిసే వారు లేరు.. చెబితే వినేవారు లేరంటూ అసహనం వ్యక్తం చేశారు. బీసీ నేతగా తన వర్గం కోసం గళం విప్పిన తనకు రెండున్నరేళ్లుగా అవమానాలు మరింత ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఆ వర్గం పెద్దలకు జరిగితే పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించండి అన్నారు. తాను పదవుల కోసమో.. పలుకుబడి కోసమే రాజీనామా చేయడం లేదన్నారు. ఇక భవిష్యత్తు గురించి తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని పొన్నాల పేర్కొన్నారు.