గుండెపోటుతో తహాసిల్దార్ మృతి

గుండెపోటుతో తహాసిల్దార్ మృతి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసిల్దార్ ఫరిదోద్దీన్ (52) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు హాజరైన తహాసిల్దార్ రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కారు డ్రైవర్ వెంటనే తహసిల్దారును కారులో కేసముద్రం మండల కేంద్రంలో ఒక ప్రైవేటు వైద్యునికి చూపించగా తాసిల్దార్ గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించి వెంటనే మహబూబాబాద్ కు తరలించాలని సూచించారు.

ఆ మేరకు తాసిల్దార్ ను కారులో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి సిపిఆర్ చేసి చికిత్స అందిస్తుండగానే రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందారు. తహాసిల్దార్ కు గుండెపోటు వచ్చిందని విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వచ్చి వైద్యులను అప్రమత్తం చేసి చికిత్స అందిస్తున్న తరుణంలో తహాసిల్దార్ మరణించడంతో  తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తమతోపాటు అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న తహసిల్దార్ కొద్ది క్షణాల్లోనే మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. తహాసిల్దార్ ఫరీదుద్దీన్ స్వస్థలం హనుమకొండ కాగా భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కేసముద్రం తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టి సుపరిచితుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.