అవును ఆ "ఇద్దరు" ఒకటయ్యారు

అవును ఆ "ఇద్దరు" ఒకటయ్యారు
  • నిన్నటి వరకు పరోక్ష విమర్శలు
  • నేడు కేటీఆర్ సమక్షంలో సయోద్య
  • పార్టీ శ్రేణుల అయోమయానికి తెర
     

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: అవును ఆ "ఇద్దరు" ఒక్కటయ్యారు. ఆ ఇద్దరు ఎవరోనని ఆందోళన చెందుతున్నారా ? వారు ఎవరో కాదు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలు. శుక్రవారం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో ఆ ఇద్దరు ఒక్కటి అయ్యారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి స్టేషన్ ఘనంగా ఘన్ పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయాలని ఆదేశించారు. దీంతో గత కొద్ది రోజులుగా కార్యకర్తల్లో ఉన్న అయోమయానికి తెరపడినట్లేనా. 


" ఎమ్మెల్యే విమర్శలు- ఎమ్మెల్సీ మౌనం"

115 మంది అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తూ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరు ప్రకటించారు. దీంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే రాజయ్య కడియం శ్రీహరి పై పరోక్ష విమర్శలకు దిగారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు కడియం శ్రీహరి మౌనం వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన తనను కాదని అధిష్టానం మరొకరికి టిక్కెట్టు ఇవ్వడం ఏంటని ఎమ్మెల్యే  ఆగ్రహం వ్యక్తం చేశారు. సొమ్మొకడిది.. సోకొకడిది, తులసి వనం నాది.. అది గంజాయి వనం, త్యాగాలు చేసింది నేను... నా వెంటే ప్రజలు, గుంటకాడి నక్క శ్రీహరి, అవినీతి ఆరోపణలు అధిష్టానానికి చెప్పారు. ఇలా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై నిన్నటి వరకు ఎమ్మెల్యే రాజయ్య పరోక్ష వాక్యాలు చేస్తూ వచ్చారు. అధిష్టానం ఆదేశమే శిరోధార్యం చిన్న చిన్న సమస్యలు ఉన్నా అగ్ర నాయకులే పరిష్కరిస్తారంటూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మౌనం వహించాడు. ఎట్టకేలకు రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చచారు. ముంగిస - పాముకున్నంత శత్రుత్వం, ఉప్పు - నిప్పుకున్నంత వైరుధ్యం ఇన్నాళ్లు ఇద్దరి మధ్య ఉన్నప్పటికీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తే  కార్యకర్తల అయోమయం సమసిపోయి వర్గ విభేదాలు లేకుండా టిఆర్ఎస్ ముందుకు సాగనుందా.