మట్టి మాఫియా

మట్టి మాఫియా
  • చిగురుమాడు మండలంలో జోరుగా మట్టి  తవ్వకాలు
  • టిప్పర్ల ద్వారా వెంచర్లకు..
  • ప్రభుత్వ భూములనూ వదలని వైనం
  • పట్టించుకోని అధికారులు
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  • స్థానికుల ఫిర్యాదుతో ఒక టిప్పర్ సీజ్

చిగురుమామిడి ముద్ర న్యూస్: ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ చిగురుమామిడి మండలంలోని ప్రభుత్వ భూములు, గుట్టలు, కుంటల నుండి కోట్లాది రూపాయల మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ రియల్ వెంచర్లకు తరలిస్తున్నారు. అనుమతి లేకున్నప్పటికీ ప్రభుత్వ భూముల్లో విలువైన మట్టిని ప్రైవేటు వ్యక్తులు ప్రైవేట్ వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మామూళ్ల మత్తులో జోగుతూ... తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిగురుమామిడి మండల కేంద్రం, సుందరగిరి గ్రామాల మధ్య లో ఉన్న  పలుగు బోటి (మట్టిగుట్ట) నుండి  కొద్ది రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.

శనివారం ఇదే గుట్ట నుండి రియల్ ఎస్టేట్ వెంచర్లకు పొరుగు మండలం  తిమ్మాపూర్ కు జేసీబీ సహాయంతో 5 టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తుండగా  స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. చిగురుమామిడి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పూదరి రాజు సంఘటన స్థలానికి చేరుకొని మట్టి తవ్వకాలను అడ్డుకొని మట్టిని లోడ్ చేసిన టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక పోలీసుల సహాయంతో మిగతా నాలుగు టిప్పర్లను, జేసీబీని తరలించడం జరుగుతుందని సదరు అధికారి తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎస్సైని సంప్రదించగా సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతనికేమీ బాధ్యత లేనట్టు బ్లూకోర్టుకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయాడని... అది మా పరిధిలోకి రాదని రెవెన్యూ అధికారులే చర్యలు తీసుకోవాలని ఎస్సై తెలిపారు. లక్షల రూపాయల విలువ గల మట్టిని మట్టి మాఫియా తరలిస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుగు బోటి గుట్ట నుండి మట్టిని తరలిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకొని మట్టి మాఫియాను అడ్డుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.