సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయని ఇసుక మాఫియా

సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయని ఇసుక మాఫియా
  • బుట్ట దాఖలైన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు
  • ప్రలోభాలకు లోనై చోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు

ముద్ర, జమ్మికుంట : మానేరు నదిలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  26 జూన్ నుండి వీణవంక మండలంలోని వివిధ గ్రామాల ఇసుక క్వారీల నుండి ఇసుక రవాణా నిలిపివేయబడింది. జిల్లా సాండ్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి   ఇసుక క్వారీలను మూసి వేయించారు. తాత్కాలికంగా కొద్ది రోజులు విరామాన్ని ఇచ్చిన ఇసుక మాఫియా బరితెగించి బుధవారం నుండి తిరిగి అక్రమ రవాణా ప్రారంభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చివరి దశ వాదనలు రేపు (14జులై) చెన్నైలో కొనసాగి అంతిమ తీర్పు రానున్న దశలో బరితెగించిన ఇసుక మాఫియా చట్ట నిబంధనలు పాటించకుండా చెలరేగిపోతూ ఈ అక్రమ రవాణాకు సాహసించడం విశేషం.  వందల కోట్ల అక్రమార్జనకు తెగించిన ఇసుక మాఫియా ఈ మేరకు వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి, చల్లూరు, పోతిరెడ్డిపల్లి ,కోర్కల్, కొండపాక ఇసుక క్వారీల నుండి వందలాది లారీలను ఇసుకను లోడింగ్ చేసి రవాణా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మానేరు పరిరక్షణ సమితి నాయకులు సంది సురేందర్ రెడ్డి ,ముదిగంటి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా మైనింగ్ అధికారులను తిరిగి ప్రారంభమైన ఇసుక రవాణా విషయమై ప్రశ్నించగా వారు దాటవేత ధోరణితో సమాధానం ఇస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సాండ్ కమిటీ చైర్మన్ హోదాలో ఈ అక్రమ దందాపై విచారణ జరిపి నిలిపివేయాలని డిమాండ్ చేశారు.  అంతేకాకుండా న్యాయస్థాన ఉత్తర్వులతో చెలగాటమాడుతున్న అధికార యంత్రాంగంపై చట్టపరమైన చర్యలకు సైతం ఉపక్రమిస్తామని వారు హెచ్చరించారు.  కళ్ళ ఎదుట ఇంత అక్రమాలు జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించక పోవడం విచారకరమని.. భవిష్యత్తులో  వారి అక్రమాలను సైతం ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మానేరు పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు.