26న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో

26న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో

ముద్ర, విజయవాడ: మహిళలు, యువత, రైతులు లక్ష్యంగా, అన్నివర్గాలను మెప్పించేలా ఈ దఫా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం కడపలో తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, 26న (శుక్రవారం) తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని సమాచారం. గతంలో నవరత్నాల పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా అమలు చేశారు. ఇప్పుడు దీనికి అప్ గ్రేడెడ్ వెర్షన్ గా మానిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పాటూ మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయంటున్నారు.

   ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు. ప్రజలను కలుసుకుని వారితో అన్ని విషయాలు చర్చించారు. అలాగే నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. బస్సు యాత్ర కూడా ముగియనుండడంతదో తదుపరి ప్రచార ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేందుకు సంసిద్ధమవుతున్నారు.