కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో (శిరీష) బర్రెలక్క 

కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో (శిరీష) బర్రెలక్క 
  • జాతీయస్థాయి నేతల నాకట్టుకుంటున్న బర్రెలక్క
  • యూట్యూబ్ వీడియోతో ఫేమస్ 
  • దాడితో జాతీయ నేతల దృష్టి

ముద్ర ప్రతినిధి,  వనపర్తి: నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి డిగ్రీ చదివిన (శిరీష) బర్రె లక్క అనే యువతి ఉద్యోగం రావటం లేదని బర్రెలను కాచి పాలు అమ్ముకుంటే బ్రతుకు వెల్ల దీయవచ్చని యూట్యూబ్లో 30 సెకండ్ల పాటు వీడియో తీసి అప్లోడ్ చేయడంతో ఫేమస్ అయ్యింది. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కొల్లాపూర్ నుండి ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క పోటీ సంచలనంగా మారింది. అంతేకాక ఆమె ఎన్నికల బరిలో నిలబడి ప్రచారం కూడా నిర్వహిస్తూ ఉండటంతో ఆమెను కొందరు బెదిరింపులకు గురి చేయిస్తుండడంతో పాటు తమ్ముడు పై దాడి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంకు చెందిన శిరీష ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఇటీవల పడిన నోటిఫికేషనులకు అప్లై చేసుకున్న పేపర్ల లీకేజీ,  నోటిఫికేషన్ రద్దుతో  ఉద్యోగాలు రాకపోవడంతో ఎన్నికల బరిలో నిలిచింది. దీంతో నిరుద్యోగుల నుంచి కూడా ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తుంది. కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఎన్నికల సంఘం ఆమెకు విజిల్ గుర్తును కేటాయించింది. దీంతో ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించగా పలువురు నుంచి మద్దతు కూడా లభించింది.

పలు పార్టీల నుంచి వ్యక్తుల నుంచి ఎన్నికల నుంచి తప్పుకోవాలని ప్రచారం నిర్వహించరాదు అంటూ బెదిరింపులు ఆటంకాలు వచ్చినప్పటికీ కృంగిపోకుండా ప్రచారం సాగిస్తుంది. గత మూడు రోజుల క్రితం పెద్దకొత్తపల్లి మండలం లో తన తమ్ముడితోపాటు మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని కొందరు ఆమె తమ్ముడు పై దాడి చేశారు. ఈ విషయంపై పలు యూట్యూబ్ ఛానల్ లో ప్రచారం కావడంతో మరింత పాపులర్ అయింది. ప్రచారానికి కావాల్సిన డబ్బులు లేకపోయినా బర్రెలక్క సాహసాన్ని గుర్తించి పలువురు సహాయం కూడా అందించారు. ఎన్నికల్లో గెలిస్తే తను చేసే పనులను మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. నిరుద్యోగులు అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని, నిరుపేదల ఇండ్లకు నిర్మాణాన్ని కృషి చేస్తానని, నిరుద్యోగులకు  నిరుద్యోగ భృతి ఇప్పి స్తానని, గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ లు ఇప్పించడం జరుగుతుందని మేనిఫెస్టోలో ప్రకటించింది. తనపై జరిగిన దాడికి రక్షణ కల్పించాలని బర్రెలక్క (శిరీష) హైకోర్టును ఆశ్రయించింది. ఏదేమైనా నియోజకవర్గంలో బర్రెలక్క హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోట విన్న బర్రెలక్క మాట వినపడడం విశేషం. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బర్రెలక్క ఎన్ని ఓట్లు సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.