బీజేపీ విజయాలు

బీజేపీ విజయాలు
  • ఎంపీలో చౌహాన్​
  • రాజస్థాన్​లో వసుంధర
  • ఛత్తీస్​గఢ్​లో రమణ్​సింగ్​

ముద్ర సెంట్రల్​ డెస్క్​: హోరాహోరీగా కొనసాగుతుందనుకున్న ఎన్నికల వార్​ కాస్త ‘వార్​ వన్​సైడ్​’ దిశగా మలుపు తీసుకుంది. దీంతో బీజేపీ విజయం నల్లేరు మీద నడకే అని తేలిపోయింది. హాట్​సీట్లలోని అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతుండగా, కొందరు విజయం సాధించారు. మరికొందరు అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్​ కొనసాగుతోంది. 

మధ్యప్రదేశ్​లో..
మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​ ఎంపీలోని బుదానీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి కమల్​నాథ్​ చించ్​వాడా స్థానం నుంచి గెలుపొందగా, ఇండోర్​ నుంచి కైలాశ్​ విజయ్​వర్గీయ్​ (బీజేపీ) విజయం సాధించారు. రాకేశ్​ సింగ్​ జబల్​పూర్​ (పశ్చిమం) (బీజేపీ) నుంచి విజయం సాధించగా, తులసీరామ్​ సిలావత్​ (బీజేపీ) సన్వార్​ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి తరుణ్​ భానోట్​ జబల్​పూర్​ (పశ్చిమం) నుంచి ఓటమి పాలయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 156 స్థానాల్లో గెలుపుదిశగా దూసుకువెళుతుండగా, రెండు స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. కాంగరెస్​ పార్టీ 66 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకువెళుతుండగా, నాలుగు స్థానాల్లో గెలుపు సాధించింది.

రాజస్థాన్​లో..
రాజస్థాన్​లో బీజేపీ 115 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకువెళుతుండగా, 12 స్థానాల్లో గెలుపొందింది. అధికార కాంగ్రెస్​ పార్టీ 68 స్థానాల్లో గెలుపు దిశగా వెళుతుండగా 10 స్థానాల్లో గెలుపొందింది. రాజస్థాన్​ సీఎంగా కొనసాగుతున్న అశోక్​ గెహ్లాట్​ సర్దార్​పురా నుంచి గెలుపొందగా, బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా భావిస్తున్న వసుంధర రాజే జాలారాపటాన్​ నుంచి విజయం సాధించారు. మరో కాంగ్రెస్​ అభ్యర్థి కోటా నుంచి పోటీలో ఉన్న శాంతికుమార్​ ధరివాల్​ గెలుపొందారు. జ్యోత్వారా నుంచి బీజేపీ అభ్యర్థి రాజ్యవర్ధన్​సింగ్​ రాథోర్​ గెలుపొందారు. తిజారా నుంచి బాబా బాలక్​నాథ్​ యోగి గెలుపొందారు. దియా కుమారి–విద్యాధర నగర్​ (బీజేపీ) గెలుపు దిశగా లీడ్​లో కొనసాగుతుండగా, సచిన్​ పైలెట్​ (కాంగ్రెస్​–టోంక్​) కూడా గెలుపు దిశగా కొనసాగుతున్నారు. 

ఛత్తీస్​గఢ్​..
ఛత్తీస్​గఢ్​లో 90 అసెంబ్లీ స్థానాలకు గాను 53 స్థానాల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తుండగా, కాంగ్రెస్​ 35 స్థానాల్లో గెలుపు దిశగా కొనసాగుతోంది. ఇతరులు రెండు స్థానాల్లో మెజార్టీ ఓట్లు సాధిస్తున్నారు. కాగా కాంగ్రెస్​ ప్రస్తుత సీఎం పటాన్​ నుంచి పోటీ చేసిన భూపేశ్​ బాగేల్​ లీడ్​లో కొనసాగుతుండగా, బీజేపీ సీఎం అభ్యర్థిగా పేర్కొంటున్న రాజ్​నందగావ్​ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్​. రమణ్​సింగ్​ గెలుపొందారు. బీజేపీ లోర్మి నుంచి పోటీ చేస్తున్న అరుణ్​ సాహు గెలుపొందారు.