అభివృద్ధికి పట్టం కట్టిన బాన్సువాడ ఓటర్లు !

అభివృద్ధికి పట్టం కట్టిన బాన్సువాడ ఓటర్లు !
  • స్పీకర్ ఓడిపోతారనే సెంటిమెంట్ కు చెక్
  • ఏడో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది పోచారం రికార్డు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధినే ప్రామాణికంగా తీసుకొని తమ నాయకుడిని ఎన్నుకొంటారని మరోసారి నిరూపించారు.   తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం  శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు.  ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన తర్వాత ఎన్నికల్లో ఎవరూ గెలుపొందలేదని,  తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్గా పని చేసిన ఎవరూ మళ్లీ అసెంబ్లీ గడప తొక్కలేదనే సెంటిమెంట్ ను పక్కన పెట్టి  పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి మంచి మెజారిటీ తో గెలిచారు.   స్పీకర్ ఒడిపోతారనే సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని తాజాగా పోచారం బ్రేక్ చేశారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన మధుసూదనా చారి సైతం ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.   పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పై 23వేల 464 ఓట్లతో గెలుపొందడం గమనార్హం.                              

పోచారం... ఏడు సార్లు విజయం

పోచారం శ్రీనివాస్ రెడ్డి 2023 ఎన్నికల్లో గెలుపొందడంతో ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించారు.  8 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా కేవలం ఒకేసారి ఓడిపోయారు.  ఆయన విజయాలను పరిశీలిస్తే..... టిడిపి తరుపున 1994లో  ఎన్నికల బరిలో నిలవగా,  కాంగ్రెస్ అభ్యర్థిని బీనాదేవిపై సుమారు 56వేల ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. అభివృద్ధే లక్ష్యంగా ఆయన పని చేయడం వల్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోచారంనకు 1998లో మంత్రి పదవితో సత్కరించారు. అనంతరం 1999 సాధారణ ఎన్నికల్లోనూ పోచారం శ్రీనివాస్ రెడ్డియే భారీ మెజారిటీతో గెలుపొంది మంత్రి పదవిని అలకించారు. అయితే 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీలో టిడిపి కొట్టుకుపోయింది. దీంతో టిడిపి అభ్యర్థి పోచారంనకు కాంగ్రెస్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ సుమారు 26వేల మెజారిటీతో గెలుపొందారు. కానీ కాంగ్రెస్ తన సీటును నిలుపుకోలేకపోయింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డిపై మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. టిడిపి అధినేత చం ద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం కారణంగా విసుగెత్తిన పోచారం 2011లో ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళిన పోచారం, 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్పై సుమారు 49వేల వె జారిటీతో గెలుపొందారు. టిఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదవిని అలంకరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాసులు బాలారాజుపై సుమారు 26వేల మెజారిటీతో గెలుపొంది. కేసీఆర్ కేబినెట్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యానవన శాఖ మంత్రిగా పదవులు ని ర్వర్తించారు.  2018 ఎన్నికల్లోను కాంగ్రెస్ అభ్యర్ధి కాసుల బాలరాజుపై 18 వేల మెజారిటీ తో గెలుపొంది, అసెంబ్లీ స్పీకర్ పదవి పొంది, సమర్ధవంతంగా అసెంబ్లీని నడిపారు. అలాగే బాన్సువాడ ను సుమారు 10వేల కోట్లతో అభివృద్ధి చేశారు.  పెరుగుతున్న వయస్సు రీత్యా ప్రస్తుతం ఆఖరి సారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయగా, ఈ ఎన్నికల్లోను 23 వేల 464 ఓట్ల భారీ మెజారిటీతో పోచారం గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలోని  కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.