ఇందిరమ్మ రాజ్యం కావాలా... రాబందుల రాజ్యం కావాలా..

ఇందిరమ్మ రాజ్యం కావాలా... రాబందుల రాజ్యం కావాలా..
  • టిఆర్ఎస్ అభ్యర్థికి కోట్ల ఆస్తులు ఎక్కడివి
  • మాజీ ఎంపీ పొంగులేటి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఇందిరమ్మ రాజ్యం కావాలో రాబందుల రాజ్యం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి లో ఆయన రోడ్ షో నిర్వహించి రాజీ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. వనపర్తి నుండి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ఇది ప్రజల నుండి తీసుకున్న డబ్బు కాదా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ అడుగులకు మడుగులొత్తే నేతలను రాబందులుగా తయారుచేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన అన్నారు. సంపన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమ కడుపులో నింపుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాయితీపరుడైన మేఘారెడ్డికి ఓటేసి గెలిపిస్తే ఏ ఒక్క తప్పు చేయడని, మచ్చలేని నాయకుడైన చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిజాయితీగా పాలన అందిస్తారని ఆయన అన్నారు.

భూములు,  చెరువులు, నదులను ఆక్రమించుకోరని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇల్లు లేని పేదలకు ఇస్తామని, కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లను ఇవ్వడంతో పాటు వాటిని పెంచుతామని చెప్పారు. అవినీతి పాలన అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

టిఆర్ఎస్ ప్రభుత్వంలో నియామకాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నియామకాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్కు ఓటేసి రాబందుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ చేయలేని ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయిందని, ఇక్కడ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి నిరుద్యోగులు హమాలీ పని చేసుకోవాలని, అంతకంటే ఉపాధి ఏముంటుందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మెగా రెడ్డి మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపిస్తే నిజాయితీగా పాలన సాగిస్తానని, చిన్నారెడ్డి సూచనలు సలహాల మేరకు నడుచుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.