స్వర్ణజయంతి సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ లో పొగలు... 

స్వర్ణజయంతి సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ లో పొగలు... 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: హజ్రత్ నిజామోద్దీన్ నుండి త్రివేండ్రం వైపు వెళుతున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( ట్రైన్ నెంబర్ -12644)లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. మహబూబాబాద్ జిల్లా గార్లమండలంలోని రాంపురం సమీపంలో శనివారం ఈ..సంఘటన చోటుచేసుకుంది.  అప్ లైన్ లో గార్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రాంపురం వద్దకు చేరుకోగానే ఏసీ కోచ్ (బి -2) నుండి పొగలు చెలరేగాయి.

బ్యాటరీలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల పొగలు వచ్చినట్లు టెక్నీషియన్లు తెలిపారు. కాగా పొగలు చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ట్రైన్ ను చైన్ లాగి ఆపి పట్టాలవెంట  పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వేసిబ్బంది సంఘటన స్థలిని పరిశీలించి, పొగలను అదుపులోకి తెచ్చారు. దీంతో సుమారుగా నలబైఐదు నిమిషాలపాటు సూపర్ పాస్ట్ రైలు అక్కడే నిలిచిపోయింది. అనంతరం రైలు బయలుదేరి వెల్లింది. విషయం దావానలంలా వ్యాపించడంతో గార్ల చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఘటనస్థలానికి చేరుకున్నారు. రైలు బయలుదేరి వెల్లడంతో ప్రయాణికులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.