నిధుల దారి మళ్లింపులో ‘హస్తం' ఎవరిది? సంచలనం సృష్టించిన గురుకుల పాఠశాల ఘటన

నిధుల దారి మళ్లింపులో ‘హస్తం' ఎవరిది? సంచలనం సృష్టించిన గురుకుల పాఠశాల ఘటన

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల/కళాశాలలో సుమారు 16 లక్షల రూపాయలను ప్రైవేటు వ్యక్తి అకౌంటుకు దారి మళ్లించిన ఘటనలో ప్రిన్సిపల్ శైలజారాణిని సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు విజయ్, శ్రీనివాసును విధుల నుంచి తొలగించిన ఘటన సంచలనంగా మారింది. అయితే 16 లక్షల రూపాయలను ప్రైవేటు వ్యక్తి కి చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేయడం అంత ఆషామాషిగా జరగలేదని విశ్వసనీయ సమాచారం. గత ఏడాది 2022 ఏప్రిల్ నుంచి గురుకులానికి విద్యార్థులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు గిరిజన సహకార సంస్థ జిసిసి నర్సంపేట శాఖకు బాధ్యతలు అప్పగించారు. మే, జూన్ మాసాలకు సంబంధించిన బిల్లులు యధావిధిగా నర్సంపేట జిసిసి బ్యాంకు ఖాతాకి జమ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత జూన్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు కేసముద్రం మండలానికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ఖాతాలోకి సరుకుల సరఫరాకు చెందిన డబ్బులను మళ్ళించారు.

సాధారణంగా ప్రతిరోజు హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా ఆహార పదార్థాలు, సరుకుల సరఫరా జరుగుతుంది. ఆమేరకు డిప్యూటీ వార్డెన్ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్, బిల్లు తయారుచేసి ప్రిన్సిపల్ ద్వారా గిరిజన సొసైటీ హెడ్ ఆఫీస్ కి పంపిస్తారు. ఇదే తరహాలో 2022లో రెండు నెలల పాటు బిల్లులు పంపించగా ఆ విధంగానే నర్సంపేట జిసిసి బ్యాంకు ఖాతాకు గురుకుల సంస్థ నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేశారు. అయితే ఆ తర్వాత కూడా బిల్లు చేసేటప్పుడు బిల్లులో పైన జిసిసి పేరు పేర్కొని, బ్యాంకు అకౌంట్ నెంబర్ వద్ద మనోహర్ ది వేసినట్టు సమాచారం. దీనితో గత నెల వరకు మనోహర్ వ్యక్తిగత ఖాతాకి 16 లక్షల రూపాయలు జమ అవుతూ వచ్చాయి. గురుకులాల సొసైటీ ప్రధాన కార్యాలయంలో బిల్లులు చూసి బ్యాంకు నుంచి డబ్బులు జమ చేసే సమయంలో జిసిసి పేరు నమోదు చేయగానే మనోహర్ అకౌంటు నంబర్, ఐ.ఎఫ్.సీ కోడ్ కనిపిస్తుందని, అలాగే జిసిసి ఖాతా నర్సంపేటకు చెందినదిగా ఉండగా, మనోహర్ ఖాతా కేసముద్రం ఎస్బిఐ కి చెందినది కావడం, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నప్పటికీ డబ్బులు మనోహర్ ఖాతాకి ఎలా జమ చేశారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఇదిలా ఉంటే ప్రతి మూడు నెలలకు ఓసారి డిప్యూటీ వార్డెన్ల డ్యూటీ మారుతుండగా ఇప్పటికీ ముగ్గురు డ్యూటీలు మారగా వారేవరు తప్పిదాన్ని గుర్తించలేదంటే నమ్మశక్యంగా లేదు. అలాగే జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్ తాము విధులు నిర్వహించిన కాలంలో డబ్బులు చెల్లింపు చేయడానికి బిల్లులు తయారు చేసే సమయంలో జిసిసి అకౌంట్ బదులు మనోహర్ అకౌంటు ఉండటాన్ని గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హెడ్ ఆఫీస్ లో బిల్లులకు నగదు చెల్లింపు సమయంలో లేదంటే బ్యాంకులో డబ్బులు ఆర్టిజిఎస్ ద్వారా ఆన్లైన్ చేస్తున్న సమయంలో ఈ తప్పును గుర్తించక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనోహర్ అనే వ్యక్తి గతంలో గురుకుల పాఠశాలకు సరుకులు సరఫరా చేసే టెండర్ దారుడు కాగా అతని టెండర్, 2022లో ముగిసిపోయినప్పటికీ దశలవారీగా 16 లక్షల రూపాయలను అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే సుమారు పది నెలలకు పైగా విద్యార్థులకు సరఫరా చేసిన సరుకులకు సంబంధించిన బిల్లు చెల్లింపు నిలిచిపోయినప్పటికి, జీసీసీ అధికారులు కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

గత నెల 23న డిప్యూటీ వార్డెన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా ఆమె వెంటనే ప్రిన్సిపాల్ కు చెప్పకుండా ఆర్ సి ఓ కు చెప్పడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ సొమ్ము ఇతరులకు బదిలీ చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు, అతి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే జమ చేయాల్సిన పరిస్థితి ఉండగా, ఈ ఘటనలో చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. మొత్తానికి పాఠశాలకు హెడ్ అయిన ప్రిన్సిపల్ శైలజ రాణి ని బాధ్యురాలిగా చేసి సస్పెండ్ చేయడంతోపాటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను విడుదల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారని విమర్శలు వస్తున్నాయి. సుమారు 16 లక్షల రూపాయల నిధులను ప్రైవేటు వ్యక్తి ఖాతాకి మళ్లించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. నిధుల దారి మళ్లింపు వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.