తప్పిపోయిన తల్లిని ఇంటికి చేర్చిన వాట్సాప్...! Mudra News

తప్పిపోయిన తల్లిని ఇంటికి చేర్చిన వాట్సాప్...! Mudra News

కేసముద్రం, ముద్ర: వాట్సాప్ ద్వారా తప్పిపోయిన తల్లిని తిరిగి ఇంటికి చేర్చిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగింది. కురవి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు ఉల్లెందుల యాకమ్మ మానసికంగా ఇబ్బంది పడుతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కేసముద్రం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సౌళ్ల తండా వద్ద రాత్రి తిరుగుతుండగా స్థానికులు గమనించి ఆమెను చేరదీసి భోజనం నీళ్లు అందించడానికి యత్నించగా తిరస్కరించింది. తన పేరు సమాచారం చెప్పడానికి, ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తే సరిగా సమాధానం చెప్పలేదు. దీనితో ఆ తండాకు చెందిన భరత్ అనే యువకుడు ఆ వృద్ధురాలు ఫొటోను పలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. దీనితో అమీనాపురానికి చెందిన ఓ వ్యక్తి ఆ ఫొటోలో ఉన్న వృద్ధురాలిని కురవికి చెందినదిగా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే యాకమ్మ కుటుంబ సభ్యులు నిరుపేదలు కావడంతో అర్ధరాత్రి కేసముద్రం వచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో ఈ విషయాన్ని కేసముద్రం ఎస్సై రమేష్ బాబుకు చేరవేశారు. స్పందించిన ఎస్సై ఆ వృద్ధురాలిని పోలీసు వాహనంలో పోలీసు సిబ్బంది చేత కురవికి పంపించి బంధువులకు అప్పగించారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా తప్పిపోయిన వృద్ధురాలు ఇంటికి సురక్షితంగా చేరింది.