ఇద్దరి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

ఇద్దరి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

అంబులెన్స్ లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

కేసముద్రం, ముద్ర: 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్స్ లో ప్రసవం చేసి తల్లి బిడ్డను ప్రాణాలతో కాపాడిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన గర్భిణీ మహిళ గుత్ప ఉమ కు ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 నెల్లికుదురు సిబ్బంది వెంటనే ఇనుగుర్తికి చేరుకొని గర్భిణికి ప్రాథమిక పరీక్షలు చేసి కడుపులో ఉన్న బిడ్డ ప్రేగు మెడ చుట్టూ కొని ఉందని నిర్దారణ చేసుకున్నారు. వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఉమకు పురిటి నొప్పులు తీవ్రం రావడంతో 108 సిబ్బంది మల్లేష్ ఫోన్లో డాక్టర్ సలహా మేరకు అంబులెన్స్ ను ఇనుగుర్తి నెల్లికుదురు మార్గమధ్యలో నిలిపి సాధారణ ప్రసవం చేశారు. ఉదయం 9:25 కు అంబులెన్సులో ఉమ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కాన్పు చేయడం వల్ల తల్లి బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. కొద్ది నిమిషాలు ఆలస్యమైనా తల్లి బిడ్డ ప్రాణాలకు గండంగా మారేదని చెప్పారు.

108 సిబ్బంది మల్లేష్, లక్కకుల ప్రసాద్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డలను కాపాడడం పట్ల ఉమ బంధువులు 108 సిబ్బందిని దేవుళ్ళుగా పేర్కొంటూ అభినందించారు.