మా గోడు వినేవారేరి? ధాన్యం బస్తాలతో రైతుల రాస్తారోకో

మా గోడు వినేవారేరి?  ధాన్యం బస్తాలతో రైతుల రాస్తారోకో

కేసముద్రం, ముద్ర: ధాన్యాన్ని విక్రయానికి తెచ్చి నెల రోజులు దాటుతున్నా ధాన్యాన్ని కొనుగోళ్లు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం ఉదయం ఇనుగుర్తి- నెల్లికుదురు ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు వేసి రైతులు రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము ధాన్యాన్ని విక్రయానికి తెచ్చి నెల రోజులు దాటిందని, కొందరి ధాన్యాన్ని తీసుకుని కాంటాలు వేసినప్పటికీ మిల్లుకు తరలించకుండా ఇక్కడే ఉంచారని ఫలితంగా తాము రోజుల తరబడి ధాన్యం వద్దే పడికాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. వానకాలం నెత్తిమీదకి వచ్చిందని, ఇంకెంతకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాలంటూ రైతులు నిరసనకు దిగారు.

తక్షణం ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకో కారణంగా కేసముద్రం- తొర్రూరు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కొనుగోలు కేంద్రం ఇన్చార్జితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.