రైల్వే స్టేషన్లు నిర్మానుష్యం..!

రైల్వే స్టేషన్లు నిర్మానుష్యం..!
  • కాజీపేట -డోర్నకల్ సెక్షన్లో పలు రైళ్ల రద్దు 
  • ప్రయాణికుల ఇబ్బందులు 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: కాజీపేట- డోర్నకల్ రైల్వే సెక్షన్లో చింతలపల్లి -నెక్కొండ మధ్య మూడో లైను పనులు, ట్రైల్ రన్ నేపథ్యంలో ఈనెల 21 నుంచి జూన్ 7 వరకు కాజీపేట డోర్నకల్ సెక్షన్ లో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. అలాగే కొన్ని రైళ్లను కాజీపేట, వరంగల్ వరకే పరిమితం చేసింది. దీనితో మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోని తాళ్లపూసపల్లి, కేసముద్రం, ఇంటికన్నె, నెక్కొండ, ఎలుగురు, చింతలపల్లి స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులు రైళ్ల రద్దు తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు అటు వరంగల్ ఇటు మహబూబాబాద్, విజయవాడ, జనగామ, భువనగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఆయా స్టేషన్ల ద్వారా నడిచే రైళ్లను పక్షం రోజులకు పైగా రద్దు చేయడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తుందని ఫలితంగా రవాణా చార్జీల భారం పడుతుందని వాపోతున్నారు. డోర్నకల్ - కాజీపేట సెక్షన్ లో 07753/54 కాజీపేట/ డోర్నకల్  (పుష్ పుల్ ఎక్స్ ప్రెస్),  07755/56 డోర్నకల్ జంక్షన్/ విజయవాడ జంక్షన్ (పుష్ పుల్ ఎక్స్ ప్రెస్), 17659/60 భద్రాచలం రోడ్డు సికింద్రాబాద్ (కాకతీయ), 12713/14 విజయవాడ సికింద్రాబాద్ (శాతవాహన),  07335/36 మణుగూరు బెలగావి, 07091/92 కాజీపేట తిరుపతి ఎక్స్ ప్రెస్ (మే 23, 30, జూన్ 6) రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సాధారణ ప్రయాణికులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైళ్ల రద్దుతో ప్రయాణానికి ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న స్టేషన్లో నిలిచే సింగరేణి, కాకతీయ, పుష్ పుల్ రైళ్ల హాల్టింగ్ రద్దు చేయడంతో స్టేషన్లో పరిధిలోని ప్రయాణికులకు రైలు సౌకర్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉదయం సాయంత్రం అప్ అండ్ డౌన్ మార్గంలో ఒకటి రెండు రైళ్ళను ఆపితే ఎంతో ఉపయోగకరంగా ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. చింతలపల్లి, ఎలుగూర్, ఇంటికన్నె, తాళ్లపూస పల్లి, గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్లో పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. వచ్చేనెల ఏడు వరకు రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాదిమంది ప్రయాణికులతో కళకళలాడే రైల్వేస్టేషన్లు కరోనా సమయంలో రైళ్ల రద్దు తో రైల్వే స్టేషన్లో నిర్మానుష్యంగా మారిపోగా, మళ్లీ ఇప్పుడు రైల్వే స్టేషన్లో నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

సీజన్ టిక్కెట్ దండుగయ్యింది:  లవ కుమార్, సీజన్ హోల్డర్

ప్రతిరోజు ఉపాధి కోసం ప్రతిరోజు రైళ్ల ద్వారా ప్రయాణించడం కోసం నెలవారి సీజన్ టికెట్ తీసుకున్నా. రైళ్ల రద్దు కారణంగా ప్రతిరోజు ఉదయం పుష్ పుల్ రైలు ప్రయాణానికి అనుకూలంగా ఉండేది. ఆ రైలు రద్దుతో మహబూబాబాద్ వెళ్లడానికి ఆర్టీసీ బస్సు లో ప్రయాణించాల్సి వస్తుంది. సీజన్ టికెట్ ఉన్నప్పటికీ ప్రతిరోజు చేతి నుండి డబ్బులు చెల్లించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ద్వారా సీజన్ టికెట్ తీసుకొని దండగ అయిందని లవ కుమార్ అనే సీజన్ హోల్డర్ వాపోయాడు. తనలాగా వందలాదిమంది కార్మికులు ఉపాధి నిమిత్తం సీజన్ టికెట్ తీసుకొని రైళ్లలో ప్రయాణిస్తుంటారని, రైళ్ల రద్దుతో ఇటు సీజన్ కు డబ్బులు ఖర్చు పెట్టారని, అటు ప్రస్తుతం బస్సుల్లో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వాపోయాడు.