ఒక్క మీటింగ్ కు కూడా అధికారులంతా రాలే..! అధికార పార్టీ ఎంపీపీ అసహనం

ఒక్క మీటింగ్ కు కూడా అధికారులంతా రాలే..! అధికార పార్టీ ఎంపీపీ అసహనం

కేసముద్రం, ముద్ర: ఐదేళ్ల పదవి కాలం దగ్గర పడుతున్నా.. ఇప్పటివరకు నిర్వహించిన ఏ ఒక్క మండల మీటింగ్ కు అధికారులంతా పూర్తిగా రాలే.. అంటూ అధికార భారాస పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ అధ్యక్షుడు ఓలం చంద్రమోహన్ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపీ అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సభ ప్రారంభానికి ముందు వివిధ శాఖల అధికారుల హాజరు పరిశీలించిన ఎంపీపీ ప్రధాన శాఖలకు సంబంధించిన అధికారులు ముఖం చాటేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తమ పదవీకాలం దగ్గర పడుతున్న ఒక్క సమావేశానికి కూడా అన్ని శాఖల అధికారులు హాజరైంది ఎన్నడూ లేదని వ్యాఖ్యానించారు. అనంతరం పశుసంవర్ధక, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, రెవెన్యూ, మిషన్ భగీరథ, విద్య, మాతా శిశు సంక్షేమంపై మొక్కుబడిగా చర్చ నిర్వహించి ‘మమ' అనిపించారు. ఇదిలా ఉంటే 40 మంది సర్పంచులు, 21 మంది ఎంపీటీసీలకు కేవలం ఎనిమిది మంది సర్పంచులు, పది మంది ఎంపిటిసిలు  మాత్రమే హాజరు కావడం గమనార్హం. అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు మండల సభ పై పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడం పట్ల ప్రజల సమస్యలు పరిష్కారమేలా అవుతాయనే విమర్శలు వస్తున్నాయి.