బాసరలో  ఏం జరుగుతోంది?

బాసరలో  ఏం జరుగుతోంది?
  • స్టూడెంట్ల మరణాలపై గవర్నర్ తమిళిసై సీరియస్​
  • 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని వీసీకి ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల క్రితమే యూనివర్సిటీలో దీపిక అనే విద్యార్థిని బాత్‌ రూంలో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే రెండు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో హాస్టల్‌ భవనంపై నుంచి మరో విద్యార్థిని లిఖిత మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నివేదిక కోరలేదు. మరణించిన ఇద్దరు విద్యార్థినులు కూడా ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. దీపిక, లిఖిత మృతికి కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. దీనిపై ప్రభుత్వం తరపున కూడా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, లిఖిత మరణంపై వీసీ ఊహాజనిత కథనాన్ని మీడియాకు వెల్లడించారు. ఆమె యూట్యూబ్‌ చూస్తూ ప్రమాదవశాత్తు భవనం సైడ్‌ వాల్‌ పై నుంచి కింద పడిందని, విద్యార్థినిది ఆత్మహత్య కాదని వీసీ వెంకటరమణ ప్రకటించారు. మరోవైపు, కుక్కలు వెంట పడడంతో లిఖిత భయంతో భవనం పైకెక్కిందని, అక్కడి నుంచి కింద పడిపోయిందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. లిఖిత ప్రమాదవశాత్తు కింద పడిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరుస మరణాలు సంభవిస్తుండడంతో ట్రిపుల్‌ ఐటీలో వరుస మరణాలతో విద్యార్థులు భయంతో వణుకుతున్నారు. ప్రస్తుతానికి తమను ఇంటికి తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. 

నివేదిక ఇవ్వండి..

బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారంపై గవర్నర్ మళ్లీ స్పందించారు. గతంలో విద్యార్థులు నిరసనకు దిగడంతో గవర్నర్​ వెళ్లి వారితో మాట్లాడారు. అక్కడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే, పలుమార్లు విద్యార్థులు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా విద్యార్థినుల మరణాలు ట్రిపుల్​ ఐటీలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్​పూర్తిస్థాయి నివేదిక అడిగారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గవర్నర్​కు ఇచ్చే నివేదికపై ఇప్పుడు కొంత ఆసక్తి మొదలైంది.