విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట - అల్పాహార పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర

విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట - అల్పాహార పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: విద్యార్థుల సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఉచిత అల్పాహార పథకాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా ల చేతులమీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులకు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యా వ్యవస్థను ఎంతో పటిష్టం చేస్తూ, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు.  విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతూ విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు.

నూతన పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందు వరుసలో ఉంటుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా నిధులు మంజూరు చేసి పాఠశాలల రూపురేఖలు మార్చివేయడం జరిగిందని, అదనపు తరగతి గదుల నిర్మాణం, డిజిటల్, ల్యాబ్ లకు ప్రత్యేక గదులు నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్నప్పటికీ, నూతనంగా బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) అమలు చేయడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.