వన్డేలు బోర్ కొట్టేస్తున్నాయి

వన్డేలు బోర్ కొట్టేస్తున్నాయి

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్‌లపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఈ మ్యాచ్‌లు కాస్తంత బోర్ కొట్టేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వన్డే ఫార్మాట్‌కు మార్పులు చేర్పులు చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. టెస్టుల విషయంలోనూ ఆయన స్పందించారు. టెస్టు మ్యాచుల ప్రాధాన్యత, ఆకర్షిణీయత కొనసాగేందుకు ఈ ఫార్మాట్‌పై ప్రజల దృష్టి మళ్లేలా కృషి చేయాలన్నారు. మ్యాచ్ ఎన్నిరోజుల పాటు సాగిందన్న అంశానికి ప్రాధాన్యత లేదన్నారు. ఇటీవల ఇండియా, ఆస్ట్రేలియా మద్య జరిగిన మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడంతో అసంతృప్తి చెలరేగిన విషయం తెలిసిందే. పిచ్‌లపై అనేక మంది విమర్శలు చేశారు. అయితే.. వివిధ రకాల పిచ్‌లపై ఆడటమనేది క్రికెటర్ల బాధ్యత అని సచిన్ స్పష్టం చేశారు.  టెస్టు క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చే విషయమై ఐసీసీ, ఎమ్‌సీసీ, ఇతర బోర్డులు చర్చిస్తున్న తరుణంలో మ్యాచ్‌లు మూడు రోజుల్లో ముగిస్తే వచ్చే నష్టమేమీ లేదని సచిన్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో పర్యటనలు పూలపాన్పులా ఉండాలని క్రికెట్ టీమ్స్ ఆశించకూడదని, అన్ని పరిస్థితులనూ తట్టుకునేలా సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు అన్నదే ప్రధానాంశాంగా క్రీడలు సాగాలని సచిన్ పేర్కొన్నారు.