భారీ బందోబస్తుతో సిద్ధమవుతున్న చెపాక్ స్టేడియం

భారీ బందోబస్తుతో సిద్ధమవుతున్న చెపాక్ స్టేడియం

స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నైకి విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. ఐపీఎల్‌లో  చెన్నై జట్టుకు మొదటి నుంచి ధోనీనే నాయకుడు.  నాలుగు సార్లు చెన్నై టీమ్‌కు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. ఇక ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాల శాతం కూడా చెన్నై పేరిటే ఉంది. అలాగే రికార్డు స్థాయిలో 9 ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ఘనత కూడా చెన్నైదే. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌కు చెందిన ధోనీని తమిళవాసులు తమ స్వంతవాడిగానే భావించి అభిమానం కురిపిస్తారు.  చెన్నైలోని చెపాక్ స్టేడియంలో  ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ సోమవారం జరగబోతోంది. సోమవారం జరగబోయే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ధోనీ సేన తలపడబోతోంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం చెన్నై వాసులు చెపాక్ స్టేడింగ్ ముందు బారులు తీరారు. ధోనీ సేన ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటెత్తుతారని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వారు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. భారీగా బందుబస్తు ఏర్పాటు చేయబోతున్నారు.

ఇక, చెపాక్ స్టేడియంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ బాధ్యతను అర్బసర్ సుమీత్  పర్యవేక్షించనున్నారు. స్టేడియంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను ఆయన స్వీకరించనున్నారు. వ్యర్థాలను తగ్గించడం, రీసైక్లింగ్ చేయడంపై దృష్టి సారించే ``గ్రీన్ ప్రోటోకాల్``ను  ఏర్పాటు చేయడానికి అర్బసర్ అధికారులు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. స్టేడియంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వస్త్రంతో చేసిన జెండాలు, బ్యానర్లను ప్రోత్సహించడంపై ``గ్రీన్ ప్రోటోకాల్`` దృష్టి పెడుతుంది.