మా నిజాయతీపై అనుమానం అక్కర్లేదు

మా నిజాయతీపై అనుమానం అక్కర్లేదు

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆట కంటే పిచ్‌ల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ పిచ్‌లపై ఆస్ట్రేలియా మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌  అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే.. కొంత మంది మాజీ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు కూడా సరిగా లేవంటూ విమర్శించాడు. ఈ సిరీస్‌ ప్రారంభం కాక ముందు నుంచే పలువురు ఆసీస్‌ మాజీలు పిచ్‌లపై అక్కసు వెళ్లగక్కారు. వీరికి వంత పాడుతూ ఆస్ట్రేలియా మీడియా కూడా వ్యతిరేక కథనాలను ఇస్తోంది. తొలి టెస్టు జరిగిన నాగ్‌పుర్‌ పిచ్‌ను తమకు అనుకూలంగా భారత్‌ మార్చుకుందంటూ ఆసీస్‌ మాజీలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గావస్కర్‌ స్పందించాడు. ''ఇక్కడ ప్రతి బంతీ సవాల్‌ విసురుతోందని.. ఓవర్‌, ఓవర్‌కు పరిస్థితులు మారిపోతున్నాయని.. అందుకే భారత్‌లో ఆటను ఎంజాయ్‌ చేస్తున్నానని.. కెప్టెన్సీనీ ఆస్వాదిస్తున్నానని స్టీవ్‌ స్మిత్‌ చెప్పాడు. ప్రస్తుత ఆసీస్‌ ఆటగాళ్లు ఎవ్వరూ.. పిచ్‌లపై మాట్లాడం లేదు. కానీ.. విమర్శలన్నీ మాజీ ఆటగాళ్ల నుంచే వస్తున్నాయి. అది కొంత ఇబ్బందిపెట్టే విషయం. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య స్నేహ సంబంధాలు 75 ఏళ్లకు చేరిన సమయంలో.. వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు సరిగా లేవు' అంటూ సన్నీ ఓ మీడియాతో అన్నాడు.  'ఇక పిచ్‌ అనేది ఇరు జట్లకు ఓకే విధంగా ఉంటుంది. విదేశాలకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి ఆడాలి. సొంతగడ్డపై ఉండే పిచ్‌లు ఇక్కడ లభించవు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి కించపరిచే పదాలు వాడటం.. భారత నిజాయతీ, నైతికతపై అనుమానం వ్యక్తం చేయడం సరికాదు. ఏ దేశమూ నిజాయతీ, నైతికతపై గుత్తాధిపత్యం కలిగి ఉండదు. నేను భారతీయుడిగా గర్వపడతాను. ఎవరైనా భారతీయులపై, నాపై అనుమానాలు వ్యక్తం చేస్తే.. నా మనసులోని మాటలను బయటపెడతాను' అంటూ గావస్కర్‌ వివరించాడు.