ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్‌పై అఫ్జల్ గంజ్‌ పోలీసులు కేసు  నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజా సింగ్‌ చేసిన ప్రసంగానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఇతర కమ్యూనిటీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఎస్‌ఐ వీరబాబు అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్‌లు 153ఏ, 506 కింద కేసు నమోదు చేశారు. ఇక, రాజా సింగ్ రెండు వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత ప్రసంగం చేసి శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.  ఇదిలా ఉంటే.. ఇటీవల రాజాసింగ్‌పై ముంబైలో కూడా పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. జనవరి 29న ముంబైలో జరిగిన ర్యాలీలో ద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై రాజా సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. శివాజీ పార్క్, లేబర్ బోర్డు కార్యాలయం మధ్య హిందూ సకల్ సమాజ్ నిర్వహించిన ర్యాలీలో రాజాసింగ్ ప్రసంగాన్ని పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు దాదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆ కార్యక్రమంలో ఒక సమాజాన్ని ఉద్దేశించి రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనే ఆరోపణలపై ఐపీసీ 153A(I)(a) కింద కేసు నమోదు చేసినట్లు ఆ అధికారి చెప్పారు.