పంజాబ్‌ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు

పంజాబ్‌ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు

ఐపీఎల్‌లో  రెండో రోజు  (శనివారం)  డబుల్ బొనాంజాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తొలుత పంజాబ్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.
గతేడాదితో పోలిస్తే కొత్త సారథులతో బరిలోకి దిగనుండటం గమనార్హం. మినీ వేలంలో కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. అయితే, గాయాలతో కీలక ఆటగాళ్లు లేకపోవడం ఇరు జట్లకూ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఈ క్రమంలో ఫ్రాంచైజీల బలాలు ఏంటో తెలుసుకుందాం..

కొత్త కెప్టెన్సీ.. 
శ్రేయస్‌ అయ్యర్ గాయం కారణంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టుకు నితీశ్ రాణాని సారథిగా ఫ్రాంచైజీ నియమించింది. గత కొన్ని సీజన్లుగా కీలక బ్యాటర్‌గా రాణించిన నితీశ్ కెప్టెన్‌గానూ తన సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో ప్రముఖ కోచ్‌గా పనిచేసిన చంద్రకాంత్‌ పండిత్‌ కేకేఆర్‌ జట్టుతో కలవడం సానుకూలాంశం. అఫ్గాన్‌ డ్యాషింగ్‌ బ్యాటర్ రహ్మానుతుల్లా గుర్బాజ్‌తోపాటు వెంకటేశ్‌ అయ్యర్ ఓపెనింగ్‌లో కీలకమవుతారు. గత సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచిన ఆండ్రూ రస్సెల్‌ ఈసారి మాత్రం సత్తా చాటాలని కోల్‌కతా అభిమానులు ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించగల రస్సెల్‌ ఫామ్‌లోకి వస్తే మాత్రం కోల్‌కతాకు తిరుగుండదు. బౌలింగ్‌లో శార్దూల్‌ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్‌ సౌథీ , ఉమేశ్‌ యాదవ్‌ తో బలంగానే ఉంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి గతేడాది పెద్దగారాణించకపోయినా అతడి ప్రదర్శనపై కోల్‌కతా ఆశలు పెట్టుకుంది.

ప్రపంచస్థాయి కోచ్‌ నేతృత్వంలో...
గత సీజన్‌లో జట్టును నడిపించిన మయాంక్‌ అగర్వాల్‌ను పంజాబ్‌ వదిలేసుకున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు సారథిగా అవకాశం కల్పించింది. మినీ వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్ (రూ. 18.50 కోట్లు)పై పంజాబ్‌ భారీ ఆశలు పెట్టుకుంది. కగిసో రబాడ లేకపోవడం వల్ల బౌలింగ్‌ విభాగం కాస్త బలహీనంగా అనిపిస్తోంది. అయితే, భారత బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌పై మరింత బాధ్యత ఉండనుంది. టీమ్‌ఇండియాపై వన్డే సిరీస్‌లో అదరగొట్టిన నాథన్‌ ఎల్లిస్‌ ఉండటం పంజాబ్‌కు సానుకూలాంశం. భారీ షాట్లు ఆడే లియామ్‌ లివింగ్‌స్టోన్ గైర్హాజరీలో జింబాబ్వే ఆటగాడు సికిందర్‌ రజా ఎలా ఆడతాడో వేచి చూడాలి. ధావన్, భానుక రాజపక్స, షారుఖ్‌ ఖాన్, జితేశ్‌ శర్మ బ్యాటింగ్‌లో కీలకమవుతారు. బౌలింగ్‌లో కాస్త బలహీనంగా ఉంది.

జట్లు (అంచనా)
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, షారుఖ్‌ ఖాన్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), సికిందర్ రజా, సామ్‌ కరన్, అర్ష్‌దీప్‌ సింగ్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్‌ బ్రార్
కోల్‌కతా: రహ్మతుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్‌ రాణా, నారాయణ్‌ జగదీశన్, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి