పెత్తనానికి కత్తెర

పెత్తనానికి కత్తెర
  • పదవీ విరమణ పొందినా ఇంకా పదవుల్లోనే
  • చాలా శాఖల్లో కీలకమైన పోస్టులు
  • రెగ్యులర్ అధికారులకు నో  ప్రయార్టీ
  • ఎట్టికేలకు చర్యలకు దిగిన ప్రభుత్వం
  • శాఖల వారిగా ఎంతమంది ఉన్నారనే వివరాల కోసం సర్కులర్ జారీ
  • త్వరలోనే వారందరిని ఇంటికి పంపేందుకు సిద్ధం

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన తరువాత కూడా రీ అపాయింట్ మెంట్ పేరిట వివిధ హోదాల్లో కొనసాగుతూ.....పెత్తనం చలాయిస్తున్న అధికారుల తోకలు కట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే శాఖల వారిగా అలాంటి అధికారులు ఎంత మంది ఉన్నారు? ఎంత కాలం నుంచి కొనసాగుతున్నారు? వారు నిర్వహిస్తున్న విధులేంటీ? తదితర అంశాల వారిగా వివరాలను సేకరించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలకు మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ వివరాలన్నింటిని నేటి (బుధవారం) సాయంత్రం  ఐదు గంటల్లోగా  అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి అన్ని విభాగాలను కోరారు.

 ప్రస్తుతం అనేక విభాగాల్లో పదవీ విరమణ చేసిన అధికారులే కీలక పదవుల్లో కొనసాగుతూ చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.  ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో వారు ఆడింది ఆట....పాడింది పాట అన్న చందంగా సాగింది.  ఫలితంగా పలు కీలక పదవుల్లో వారే  రాజ్యమేలారు. అప్పటి పాలకుల కనుసైగల్లో పనిచేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా వారు తమ స్వామిభక్తిని చాటుకున్నారు. దీంతో ఆ పదవుల్లో  విధులు నిర్వహించాల్సిన పలువురు అధికారులకు పదోన్నతులు లభించలేదు. ఆ పదోన్నతుల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించినా వారికి అవకాశం లభించ లేదు. ఇక అప్పటి ప్రభుత్వం కూడా వారికే అధిక ప్రాధాన్యతను ఇస్తూ...రెగ్యూలర్ అధికారులను విస్మరించింది. ఫలితంగా సదరు అధికారులు తనకు నచ్చిన ఫైళ్లనే ముందుకు పంపారు. నచ్చని ఫైళ్లను తమ టేబుల్ల కిందనే పాతిపెట్టారు. ఈ పరిణామాల పట్ల కిందిస్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.  ఇదే విషయంపై అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా అధికార  పార్టీ (బీఆర్ఎస్) ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే పదవీ విరమణ చేసినా... ఇంకా కుర్చీలను పట్టుకుని వేలాడుతున్న అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. 

ఆయన చెప్పిన విధంగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ డిపార్టుమెంటుల్లో  పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయంలో రీపాయింట్ అయి ఇంకా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారి లెక్కలు తీయడం మొదలు పెట్టింది. ఇందుకోసం అన్ని డిపార్టుమెంట్లు, విభాగాలు, కార్పొరేషన్లు,. ఏజెన్సీలకు రాష్ట్రక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఒక  సర్కులర్ జారీ చేశారు.  ఇందులో సదరు అధికారుల పూర్తి వివరాలను బుధవారం సాయంత్రం ఐదు గంటల కల్లా చేరాలా పంపించాలని సూచించారు. దీని కోసం నిర్ణష్టమైన ఫార్మెంట్ ను కూడా జత చేశారు. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన రీ అపాయింట్  వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.  ఇక అలాంటి అధికారుల  ఏరివేత కోసం ఈ వివరాలను ప్రభుత్వం తెప్పించుకున్నదనే చర్చ సచివాలయంలో  జోరుగా సాగుతోంది.  

ప్రస్తుతం సదరు అధికారుల సంఖ్య పలు విభాగాల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారని తెలుస్తోంది. ప్రధానంగా రోడ్లు, భవనాలు,  ఇరిగేషన్, అగ్రికల్చర్, పంచాయత్ రాజ్ తదితర విభాగాల్లో చాలా మంది అధికారులు  విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. రోడ్లు, భవనాల శాఖలో ఈఎన్ సీలు విధులు నిర్వహిస్తున్న గణపతిరెడ్డి, రవీందర్ రావు, శంకరయ్య,. శ్రీనివాస్ రావు, శ్రీహరి, ఇరిగేషన్ శాఖలో ఇఎన్ సీలుగా కొనసాగుతున్న మురళీధర్, విజయ్ భాస్కర్ లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్ సీ నల్లా వెంకటేశర్లు , అంతర్ రాష్ట్ర ఎస్ సీ కొనసాగుతున్న కోటేశ్వర్ రావులు చాలా కాలంగా పదవీ విరమణ తరువాత కూడా ఆ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇక ఐఏఎస్ అధికారులుగా రిటైర్డు అయిన రాణికుముదిని, అనిల్ కుమార్ వంటి అనేక మంది అధికారులకు గత ప్రభుత్వం సంవత్సరాల తరబడి కీలక పదవుల్లో కొనసాగించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్వరలో సదరు అధికారులను ఇంటికి పంపడం ఖాయమన్న ప్రచారం  రాజకీయ జోరుగా సాగుతోంది. వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారా ? లేక మాయమైన ఫైళ్ల గురించి ఆరా తీసే అవకాశం ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.