సిద్దిపేటలో రియల్ భూమ్.. లక్ష దాటిన గజం భూమి ధర

సిద్దిపేటలో రియల్ భూమ్.. లక్ష దాటిన గజం భూమి ధర
  • హైదరాబాద్ బంజారాహిల్స్ రేటు పలుకుతున్న ప్లాట్లు
  • తెలంగాణ రాకతో ఐకాన్ గా మారిన సిద్దిపేట

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేటలోని మైత్రివనం ఏరియాలో ఒకప్పుడు చక్కెర ఫ్యాక్టరీ ఉండేది అది జనావాసాలకు దూరమైన ప్రాంతం అక్కడ 1990వ దశకంలో రోడ్ సైడ్ గజం జాగా ధర 150 రూపాయలు... మరిప్పుడు అదే ప్రాంతంలో రోడ్ సైడ్ గజం భూమి ధర లక్ష రూపాయల పైనే... సిద్దిపేటలోని కోటిలింగాల గుడి ఒకప్పుడు  నిర్జన ప్రదేశం రోడ్ సైడ్ గజం జాగా 40 లేదా 50 రూపాయలు మరి ఇప్పుడు రోడ్ సైడ్ గజం ధర 50 వేల పైనే..

సిద్దిపేటలో హైదరాబాదు రోడ్డుకు ఇప్పుడు ప్లాట్ కొనాలి అనుకుంటే మన వద్ద రెండు కోట్లు ఉండాలి...
కోటిలింగాల ఏరియాలో కొనాలనుకుంటే కోటి రూపాయలు ఉండాలి... తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుతం సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ఏర్పాటులో సిద్దిపేట పోషించిన పాత్రతోపాటు వచ్చిన గుర్తింపు...ఇక్కడి నేతలు పట్టణాభివృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలే కారణంగా చెప్పవచ్చు... అప్పుడు ఎమ్మెల్యేగా కెసిఆర్,ఇప్పుడు మంత్రిగా హరీష్ రావులు సిద్దిపేట ప్రగతిపై దృష్టి సారించడం, సకల సౌకర్యాలు కల్పించడంతో పట్టణం వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఉన్న అనేక కంపెనీలు సిద్దిపేటలో తమ వ్యాపారాల విస్తరణకై పరుగెత్తుకు వస్తున్నాయి. దీంతో రోడ్ సైడ్ షెటర్లు, గ్యారేజీలు ,షాపింగ్ మాల్స్, గోదాములు, డిస్ట్రిబ్యూటర్ సెంటర్లను నెలకొల్పుకోవడానికి ఏకంగా స్థలాలను కొనుగోలు చేస్తున్నాయి. అంతే  భూ యజమానులకు కాసుల వర్షం కురుస్తోంది. ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే పట్టణం అటు పొన్నాల వరకు..ఇటు ఇమాంబాద్ వరకు... మరోవైపు బూరుగుపల్లి వరకు... ఇంకోవైపు మందపల్లి దాకా ...తూర్పు వైపు మిట్టపల్లి దాకా విస్తరించింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీగా పట్టణ పరిసర ప్రాంతాల్లో వెలిశాయి. పట్టణానికి 7 ,8 కిలోమీటర్ల దూరం ఏర్పాటుచేసిన వెంచర్లలో కూడా కనీసం పదివేలపైనే గజానికి ధర పలుకుతుంది. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి సిద్దిపేటలో (సిద్దిపేట పట్టణ అభివృద్ధి సంస్థ) సుడా ద్వారా మిట్టపల్లి వద్ద ఏర్పాటు చేసిన వెంచర్లలో ఇదే ధరను నిర్ణయించి ప్లాట్లు విక్రయిస్తున్నారు.

150 గజాల ప్లాటు 18 వేలకు కొన్న...

సిద్దిపేటలోని హైదరాబాదు రోడ్ లో ఉన్న బీజేఆర్ చౌరస్తా సమీపాన భవాని నగర్ లో 1996లో 150 గజాల ఖాళీ స్థలాన్ని 18 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు గానగోని బాల గౌడ్ అనే స్థల యజమాని తెలిపారు. ఇటీవల తన ఇంటి సమీపంలోని భూమి గజం ధర 65 వేల రూపాయలకు అమ్ముడు పోయిందని తెలిపారు.

మైత్రివనంలో రోడ్ సైడ్ గజం ధర  లక్ష పైమాటే

హైదరాబాద్ రోడ్ లోని మైత్రివనంలో నివసించే డాకూరి వెంకట్రాంరెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన డబ్బుతో 200 గజాల స్థలాన్ని రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇల్లునిర్మించుకున్నారు. ఇప్పుడు అక్కడ గజం ధర లక్షపైనే నడుస్తుందని తెలిపారు. రోడ్ సైడ్ ప్లాట్లు, స్థానికుల కంటే ఎక్కువ హైదరాబాద్ ప్రాంత వాసులే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

గజం 15 రూపాయలకు అమ్మాం..

సిద్దిపేటలో ప్లాట్ల బిజినెస్ ప్రారంభించి పట్టణ ప్రజలకు చిరపరచితునిగా పేరుగాంచిన కడవెరుగు నరసయ్య మాట్లాడుతూ సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల ఎదురుగా 1983లో ప్లాట్లు చేసి గజానికి 15 రూపాయల చొప్పున విక్రయించినట్లు తెలిపారు. అప్పుడు హైదరాబాద్ రోడ్ లోని రంగదాంపల్లి చౌరస్తా వద్ద గజానికి 50 రూపాయల చొప్పున అమ్మినట్లు తెలిపారు. ఇప్పుడు విమార్ట్ ఉన్న ప్రాంతంలో 175 గజాల స్థలము గంప గుత్తగా 6600 కు విక్రయించానని కూడా తెలిపారు. ఇప్పుడక్కడ లక్ష రూపాయలు గజం చొప్పున ధర పలుకుతోంది.